Pawan Kalyan Reacts On Vote Chori: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో( AP deputy CM Pawan Kalyan ) జాతీయ భావాలు ఎక్కువ. జాతీయ అంశాలకు సంబంధించి ముక్కు సూటిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఈ విషయంలో బిజెపికి బలమైన మద్దతు దారుడు కూడా. అయితే ఇప్పుడు అదే బిజెపి ఈవీఎంలతో గెలుస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఏపీలో సైతం అదే అభిప్రాయంతో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఏపీ విషయంలో స్పందించడం లేదు. మిగతా రాష్ట్రాలలో ఓట్లు చోరీ జరిగింది అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దానిని తప్పుపడుతున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రాహుల్ గాంధీ లైన్ లో చంద్రబాబు ఉన్నారని.. వీరిద్దరి మధ్య రేవంత్ రెడ్డి అనుసంధాన కర్త అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అదే అంశంపై మాట్లాడారు. ఓట్ల చోరీ అంటూ విపక్షాలు చేస్తున్న ఆందోళనల వెనుక విదేశీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేసిన తరువాత పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
జగన్ వైఖరి పై కామెంట్స్..
ఏపీలో జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )వైఖరి పై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. తాము గెలిచినప్పుడు న్యాయంగా ఉందని.. ఓడిపోయినప్పుడు మాత్రం ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించడం ఏంటని ప్రశ్నించారు. దేశం పురోగతిలో ఉన్నప్పుడు మనల్ని నియంత్రించడానికి విదేశీ శక్తులు.. మనదేశంలో ఉన్న అంతర్గత శక్తులను వాడుకొని అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తాయని.. ఇప్పుడు అదే జరుగుతోందన్న అనుమానాలను వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈవీఎంలతో ఓడిపోతే ట్యాంపరింగ్ అంటున్నారని.. బ్యాలెట్ విధానంలో ఓడిపోతే రిగ్గింగ్ అనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Also Read: మళ్లీ నీటి పంతం.. బనకచర్ల కోసం చంద్రబాబు రేవంత్ ఫైటింగ్
జాతీయ అంశాలపై స్పష్టత..
పవన్ వైఖరిలో ఒక స్పష్టత ఉంది. దేశ సమైక్యత విషయంలో మాత్రం రాజకీయాలు ఉండకూడదు అనేది పవన్ అభిమతం. హిందూ ధర్మ పరిరక్షణ గురించి అప్పట్లో వ్యాఖ్యానించి సంచలనం గా మారారు పవన్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలమైన వ్యవస్థ రావాలని ఆకాంక్షించారు. హిందీ భాష పై కూడా తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు బయటపెట్టారు. ఇప్పుడు ఓట్లు చోరీపై జరుగుతున్న ప్రచారం, బిజెపి పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు పవన్ కళ్యాణ్. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసేందుకు బయట శక్తులు ప్రయత్నిస్తున్నాయని.. అంతర్గత శక్తులు సహకరిస్తున్నాయన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు పవన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే భారత్ పై కుట్రలు చేసే ఓ అమెరికా పారిశ్రామికవేత్తతో టచ్ లో ఉంటారని బిజెపి విపక్షాలపై అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు పవన్ సైతం అదే తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.