Deputy CM Pavan Kalyan : పవన్ దూకుడు.. గ్రామసభల స్ఫూర్తితో మరో వేడుకకు రెడీ

డిప్యూటీ సీఎం పవన్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. కొద్ది రోజుల కిందటే ఏపీవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి చేపట్టాల్సిన పనులను గుర్తించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో మరో వేడుకకు సిద్ధమవుతున్నారు.

Written By: Dharma, Updated On : August 26, 2024 4:06 pm

Deputy CM Pavan Kalyan

Follow us on

Deputy CM Pavan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 80 రోజులు అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నిత్యం సమీక్షలు, సమావేశాలతో తన శాఖల ప్రగతిని తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ కీలకమైన నాలుగు శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పర్యావరణ శాఖలను నిర్వర్తిస్తున్నారు. కీలకమైన పల్లెపాలన అంతా పవన్ చేతిలో ఉంది. అందుకే గత రెండు నెలలుగా తన శాఖలను అధ్యయనం చేశారు పవన్. అనంతరం యాక్షన్ లోకి దిగారు. ముఖ్యంగా పంచాయతీలపై ఫోకస్ చేశారు. గ్రామీణ స్థాయిలో పనులు పరుగుపెట్టేలా.. గ్రామసభలకు శ్రీకారం చుట్టారు. ఈ ఆలోచన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో 13 వేలకు పైగా పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు జరిగాయి. ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ సమస్యలను విన్నవించారు. చేయాల్సిన పనుల గురించి వివరించారు.

* అప్పుడెప్పుడో వైయస్సార్ హయాంలో
వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు గ్రామ సభలు నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి.. ప్రజలకు ఉపయోగపడిన పనులు చేపట్టారు. మళ్లీ ఇన్ని రోజులకు గ్రామసభలు పెట్టారు. గత పదేళ్లుగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన గ్రామసభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇదిపవన్ ఆలోచన కావడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది ఈ గ్రామ సభలతో.

* తాజాగా పర్యావరణంపై
అయితే పంచాయితీల్లో గ్రామసభలు సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడంతో.. అటవీ శాఖ పై దృష్టి పెట్టారు పవన్. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని భావించారు. గత రెండు నెలలుగా అటవీ శాఖ పై వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు పవన్. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వన మహోత్సవం పేరుతో ఈనెల 30న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొనాలని, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

* వన మహోత్సవానికి ఎంపిక
వన మహోత్సవం కార్యక్రమం నిర్వహణకు 11 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అక్కడ పచ్చదనం పెంపొందించనున్నారు. రహదారుల మధ్య ఉన్న డివైడర్లలో మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన హరిత అభివృద్ధి నిధులను వినియోగించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ఈ నిధులను సైతం పక్కదారి పట్టించిందని.. కానీ తాము మాత్రం హరితవనాలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గిస్తామని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఈనెల 30న వేడుకల నిర్వహించాలని పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం విశేషం.

Tags