Dense Fog: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సంక్రాంతి తర్వాత ఎండలు మండుతున్నాయి. అదే స్థాయిలో మంచు విపరీతంగా పడుతోంది. పొగ మంచు అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సాయంత్రం ఐదు గంటల నుంచి పొగ మంచు తీవ్రత పెరుగుతుంది. ఉదయం 9 గంటల వరకు కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. రహదారులపై అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించడం లేదు. హైదరాబాద్- విజయవాడ హైవే లో హెడ్లైట్ వెలుగుల్లో వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. చాలాచోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు.
* ఈ ఏడాది విపరీతంగా
సంక్రాంతి ( Pongal)తరువాత చలి తగ్గుముఖం పడుతుంది అంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఆ పరిస్థితి లేదు. చలి విపరీతంగా ఉండగా.. పొగ మంచు కుమ్మేస్తోంది. సాయంత్రం ఐదు దాటితే బయటకు రావడానికి ఇబ్బందికరంగా మారింది. రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదు. దీంతో లైట్లు వేసుకొని అతి కష్టం మీద గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి వణికించేస్తోంది. చలికి తోడు విపరీతమైన పొగ మంచు కురుస్తుండడంతో పంటలు సైతం నాశనం అవుతున్నాయి. ప్రస్తుతం జీడీ మామిడి పూత వస్తోంది. మరోవైపు రబీలో భాగంగా ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. కానీ పొగ మంచుతో నాశనం అవుతున్నాయి.
* విమానాలకు అడ్డంకి
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని( International Airport) పొగ మంచు కుమ్మేసింది. దీంతో రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. రన్వే విజిబులిటీ లేక విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్టులో సైతం ఇదే పరిస్థితి ఉంది. మరి కొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే పొగ మంచు పుణ్యమా అని ఎక్కడికి అక్కడే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై వాహనాలు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటున్నాయి. చాలా వాహనాలను నిలిపివేస్తున్నారు. ఉదయం పొగ మంచు వీడిన తర్వాతనే ప్రయాణాలు మొదలు పెడుతున్నారు.
* మరికొన్ని రోజులపాటు ఇలానే
అయితే ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చలితోపాటు పొగ మంచుతో చిన్నారులు, వృద్ధులు( old persons) తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వీలైనంతవరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు మంచు కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎక్కువమంది జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.