Delhi Banikacharla Update: రాష్ట్ర విభజన జరిగి దాదాపు పుష్కరకాలం అవుతోంది. కానీ రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యంగా ‘వాటర్ పాలిటిక్స్'( water politics) నడుస్తోంది. అయితే విభజన జరిగి తొలి పదేళ్లు ఈ వివాదమే లేకుండా నడిచింది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజిత తెలంగాణలో కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంగా కాంగ్రెస్ తో పాటు బిజెపి ఉండేది. నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇక్కడ రాజకీయ ప్రత్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండేది. అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే ఉభయ తెలుగు రాజకీయ పార్టీలు పాకులాడాయి.
రాజకీయ వైరుధ్యం
2014లో తెలుగు రాష్ట్రాల్లో పరస్పర విరుద్ధ ప్రభుత్వాలు వచ్చాయి. కెసిఆర్( kalvakkunta Chandrashekhar Rao ) అంటే చంద్రబాబుకు గిట్టదు. చంద్రబాబు ఆధిపత్యాన్ని కేసీఆర్ ఒప్పుకునే వారు కాదు. ఈ క్రమంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేశారు కెసిఆర్. చంద్రబాబు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్తో చెలిమి చేశారు. తొలివిడత ఐదేళ్లు అలా గడిచిపోయింది. తరువాత ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో కెసిఆర్ రెండోసారి అధికారం చేపట్టారు. ఆ ఇద్దరూ స్నేహితులుగా కొనసాగుతూ వచ్చారు. కానీ విభజన సమస్యలపై ఎటువంటి ఫోకస్ చేయలేదు. అలా రెండో విడత ఐదేళ్లు వారిద్దరూ గడిపేశారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ ఇద్దరు సన్నిహిత నేతలు కావడంతో విభజిత సమస్యలు పరిష్కారం అవుతాయని అంతా భావించారు.
Also Read: Janasena Votebank Strategy: పవన్ ప్లాన్ సక్సెస్.. జగన్ ఆయువుపట్టు పై గురి!
విభిన్న ప్రభుత్వాలు..
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విభిన్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఏపీలో( Andhra Pradesh) ఎన్డీఏ పాలక పక్షం ఉంది. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధమైన కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ విపక్షాలు ప్రభావితం చేస్తున్నాయి. అవి చేసే రాజకీయంతో పాలకపక్షాల వ్యూహాలు మారుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే బనకచర్ల జలవివాదం. గోదావరి మిగులు జలాలను ఉపయోగించుకుని రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్నదే బనకచర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అయితే సింహభాగం ప్రయోజనాలు తెలంగాణవేనని.. హైదరాబాద్ నగర వాటా, తెలంగాణ వాటా పోను.. మిగతా నీటిని మాత్రమే ఏపీ ఉపయోగించుకోవాలని తెలంగాణ వాదిస్తోంది. అయితే సముద్రంలో కలుస్తున్న వృధా జలాలను మాత్రమే బనకచర్లకు తరలించాలని తాము చూస్తున్నట్లు ఏపీ చెబుతోంది. అయితే తెలంగాణ నుంచి వచ్చిన అభ్యంతరాలు.. అక్కడ రాజకీయ ప్రయోజనాలను చూసుకొని కేంద్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు.
ఢిల్లీ బాటలో సీఎంలు..
ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఢిల్లీలోనే( Delhi) ఉన్నారు. కేంద్ర జల శాఖ మంత్రి వద్ద సమావేశం అవుతారని అంతా భావిస్తున్నారు. అయితే ఇది బనకచర్ల కోసమేనని చర్చ నడుస్తోంది. కానీ తెలంగాణ వర్గాలు మాత్రం కొట్టి పారేస్తున్నాయి. ఇప్పటికే బనకచర్ల అంశాన్ని ఏపీ అజెండాగా పంపింది. తెలంగాణ మాత్రం కృష్ణా నది నీటి పంపకాలు ప్రాజెక్టులపై చర్చిద్దామని అజెండాగా పంపింది. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈ వాటర్ పాలిటిక్స్ ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఒకవేళ చంద్రబాబుపై ఉన్న గౌరవంతో రేవంత్ రెడ్డి బనకచర్ల విషయంలో చర్చలు జరిపితే మాత్రం దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్. అదే సమయంలో బనకచర్ల కావాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనీస స్థాయిలో కూడా డిమాండ్ వినిపించడం లేదు. అక్కడ వద్దని వారిస్తోంది బిఆర్ఎస్. కానీ రాయలసీమను సస్యశ్యామలం చేసే బనకచర్లను కావాలని మాత్రం అడగలేకపోతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో వాటర్ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరుకున్నాయి. మరి ఇవి ఎలా చల్లబడతాయో చూడాలి.