Andhra Pradesh Politics : రాజకీయాల్లో మహిళలు రాణించడం అంత సులువు కాదు. అయితే ఈ విషయంలో దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) ఒక ప్రత్యేకమే. ఎంపీగా, కేంద్రమంత్రిగా, ఏపీలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా రాణించారు. అలాగని ఆమె పొలిటికల్ కెరీర్ అంత సులువుగా సాగలేదు. దాదాపు 11 సంవత్సరాల పాటు ఆమె ఎటువంటి పదవులు చేపట్టలేదు. అయినా సరే రాజకీయంగా నిలబడగలిగారు. ప్రస్తుతం లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు. ఆమెకు కేంద్రమంత్రి తో పాటు బిజెపి జాతీయ అధ్యక్షురాలిగా పదవులు వరించబోతున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. రెండిట్లో ఒకటి తప్పదు అని టాక్ నడిచింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో అది ఇప్పట్లో సాధ్యమయ్యేనా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
* తప్పిన మంత్రి పదవి..
ఏపీ బీజేపీ( AP BJP) అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఉన్న సమయంలోనే 2024 ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు వెనుక ఆమె కృషి ఉంది. అయితే పొత్తులో భాగంగా బిజెపి ఆరు పార్లమెంట్ స్థానాలు, పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది. 8 అసెంబ్లీ తో పాటు మూడు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. రాజమండ్రి ఎంపీగా గెలిచారు పురందేశ్వరి. అయితే అనూహ్యంగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా గెలిచిన భూపతి రాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే మంత్రివర్గ విస్తరణలో పురందేశ్వరికి అవకాశం ఇస్తారని అంతా భావిస్తున్నారు. కానీ ఆమె సామాజిక వర్గానికి చెందిన గుంటూరు టిడిపి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర క్యాబినెట్ లో ఉన్నారు. ఆయనను తొలగించి పురందేశ్వరికి ఇవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన పారిశ్రామికవేత్త. ఆపై చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కూడా.
* ఆ విషయంలో మైనస్
మరోవైపు బిజెపి జాతీయ అధ్యక్ష పదవికి పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్టీఆర్( NTR) కుమార్తెగా, కేంద్ర మాజీ మంత్రిగా ఆమెకు గుర్తింపు ఉంది. అయితే బిజెపి జాతీయ అధ్యక్ష పదవి అనేది.. వివిధ పార్టీల నుంచి చేరే వారికి ఇవ్వడం చాలా అరుదు. దశాబ్దాల కాలం పాటు బిజెపిలో కొనసాగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా సంఘ్ ప్రభావం ఎక్కువ. ఆర్ఎస్ఎస్ లో పనిచేసి.. బిజెపిలో చేరిన వారికి ప్రయారిటీ ఇస్తారు. ఆపై పురందేశ్వరికి ఏపీలో ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీతో గతంలో సంబంధాలు ఉండేవి. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆమెకు స్వయానా తండ్రి. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీ చాలా యాక్టివ్ గా ఉంది. ఆపై ఎన్డీఏలో కీలక భాగస్వామి కూడా. అందుకే ఈ విషయంలో పురందేశ్వరికి జాతీయ అధ్యక్షురాలు పదవి ఇస్తే పెద్దగా ప్రభావం ఉండదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఎంపీ గానే కొనసాగుతారని.. ఆమె పదోన్నతి 2029 తరువాతేనని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.