First Supermoon of the Year : అనంతమైన ఆకాశంలో సెకనుకో అద్భుతం జరుగుతూ ఉంటుంది. చూసే ఓపిక మనకు ఉండాలే గాని ప్రతిక్షణం అచంచలమైన ఆశ్చర్యాలను అందిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆకాశంలో ఊహించని మార్పులు జరుగుతుంటాయి. అవన్నీ కూడా సరికొత్త వింతలకు కారణమవుతుంటాయి. ఇప్పుడు అటువంటి వింత ఒకటి ఆకాశంలో చోటు చేసుకోబోతోంది. ఇంతకీ ఆ వింత ఏమిటంటే..
నింగిలో అంతుచిక్కని ఆశ్చర్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. మిగతా వాటిని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక కొన్ని వింతలను పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముందే తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అలాంటి ఒక వింత రేపు చోటుచేసుకోబోతోంది. వినీలాకాశం దానికి వేదికవుతోంది. ఈ ఏడాది తొలి సూపర్ మూన్ అక్టోబర్ 6, 7 తేదీలలో కనువిందు చేయనుంది. ఇలా చందమామ ఏర్పడడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.
సాధారణంగా భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. కొన్ని సందర్భాలలో భూమి చుట్టూ తిరుగుతూ దగ్గరగా వస్తుంటాడు. ఈ సమయంలో చంద్రుడి పరిమాణం, కాంతి ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ 6,7 తేదీలలో చంద్రుడి పరిమాణం 14 శాతం.. వెలుగు 30% అధికంగా ఉంటుంది. ఈ ఏడాది మరో రెండు సార్లు సూపర్ మాన్ లు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నవంబర్ 2, డిసెంబర్ నెలలో సూపర్ మూన్ లు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
సూపర్ మూన్ ఏర్పడినప్పుడు ఆకాశం అత్యంత పారదర్శకంగా కనిపిస్తుందని.. చంద్రుడి వెన్నెల మరింత కాంతివంతంగా దర్శనమిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వెన్నెల పౌర్ణమి కంటే రెట్టింపు స్థాయిలో ఉంటుందని.. సినిమాలలో చూపించినట్టే ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. టెలిస్కోప్ తో కనుక చూస్తే చంద్రుడి పెద్ద పరిమాణాన్ని మరింత ఆస్వాదిస్తూ చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సూపర్ మూన్ ఏర్పడుతున్నప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. సూపర్ మూన్ ఎలా ఏర్పడుతుంది అనే అంశంపై స్పష్టత ఉన్నప్పటికీ.. భవిష్యత్తు కాలంలో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే ఏవైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా? అవి భూమికి ఏమైనా ప్రమాదాన్ని తీసుకొస్తాయా? అనే కోణాలలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయోగాలలో ఏ అంశాలను పరిశీలించారు.. అనే విషయాలను ఇంతవరకు బయట పెట్టలేదు. చంద్రుడి వల్ల భూమికి ఎటువంటి నష్టం లేకపోయినప్పటికీ.. ఇటువంటి సూపర్ మూన్ దృశ్యాలు మాత్రం చూసేవారికి ఆనందాన్ని కలగజేస్తుంటాయి.