Cyclone Montha disrupts: భారీ తుఫాన్ ఏపీని( Andhra Pradesh) భయపెడుతోంది. ప్రచండ వాయుగుండం తీరానికి దగ్గరవుతోంది. 13 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. వాయుగుండం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు ప్రారంభం అయ్యాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. అయితే కీలకమైన కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా అమరావతి రాజధానిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఒక కార్యక్రమం వాయిదా పడడం కాస్త ఇబ్బందికరమే. ఇప్పటివరకు అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందనగా తుఫాను ప్రభావంతో కార్యక్రమం నిలిచిపోయింది.
ఆర్బిఐ సైతం..
అమరావతి రాజధాని లో( Amravati capital ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు ఎకరాల స్థలంలో ప్రధాన కార్యాలయం నిర్మాణానికి ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద 12 కోట్ల రూపాయలకు భూమిని కొనుగోలు చేసింది. మరోవైపు ప్రధానమైన 12 బ్యాంకులు తమ ప్రాంతీయ కార్యాలయ భవనాలను ఒకే చోట నిర్మాణం చేపట్టాలని భావించాయి. రేపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో శంకుస్థాపన పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అనుకున్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి పూర్తిగా భరోసా ఇచ్చినట్టు అవుతుంది. బ్యాంకు కార్యాలయాలు అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తాయి. అందునా రిజర్వ్ బ్యాంకు అమరావతిలో భవన నిర్మాణానికి దిగిందంటే.. ఇక రాజధానిని ఎవరు కదిలించలేరన్న ధీమా వచ్చేది. ఈ బ్యాంకుల ద్వారా అమరావతికి తమ మద్దతు సంపూర్ణ స్థాయిలో ఉందని కేంద్రం సంకేతాలు పంపింది. అయితే తుఫాను పుణ్యమా అని ఈ కార్యక్రమం వాయిదా పడింది.
వేడుకగా ప్రారంభించాలని..
అమరావతిలో రిజర్వు బ్యాంకు తో ( Reserve Bank )పాటు 12 ప్రధాన బ్యాంకుల కార్యాలయాల నిర్మాణం పనులను వేడుకగా ప్రారంభించి సరికొత్తగా సంకేతాలు పంపాలని చూసింది కేంద్ర ప్రభుత్వం. ఇది పూర్తిగా కేంద్రం ఆధీనంలో జరుగుతున్న కార్యక్రమం. కానీ అమరావతికి చంద్రబాబు సర్కార్ ఎనలేని ప్రాధాన్యమిస్తున్న దృష్ట్యా.. ఇప్పటికీ అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతూనే ఉంది. దాని దూకుడుకు కళ్లెం వేయాలంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలను ప్రారంభించి.. సరైన సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గాని దానికి తీవ్ర తుఫాను అడ్డంకిగా నిలిచింది.