Bihar election results: బీహార్ లో ( Bihar) ఏ పార్టీ గెలుస్తుంది? ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందా? లేకుంటే మహాఘాట్ బంధన్ విజయాన్ని కైవసం చేసుకుంటుందా? ఎన్డీఏ గెలిస్తే ఏమవుతుంది? ఓడిపోతే ఏం జరగనుంది? బీహార్ ఎన్నికలు ఏపీ పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏ తరపున బీహార్లో ప్రచారానికి వెళ్తానని చెప్పారు. ఎన్డీఏ లో కీలక భాగస్వామి కావడంతో కేంద్ర పెద్దల పిలుపుమేరకు ఆయన బీహార్ ప్రచారానికి వెళ్ళనున్నారు. ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం చేశారు. అక్కడ బిజెపి విజయం సాధించింది. అందుకే చంద్రబాబును బిజెపి పెద్దలు ప్రచారానికి పిలిచినట్లు తెలుస్తోంది. మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సైతం చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి.
గట్టి ఫైట్..
బీహార్లో నువ్వా నేనా అన్నట్టు పరిస్థితి ఉంది. ఎన్డీఏ వర్సెస్ మహా ఘాట్ బంధన్( Maha Ghat Bandhan) గట్టిగానే తలపడుతున్నాయి. ప్రస్తుతానికి చూస్తే మహా ఘాట్ బంధన్ దూకుడు మీద ఉంది. ఆ కూటమిలో కీలక భాగస్వామిగా ఆర్జెడి ఉంది. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ బీహార్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గత 15 రోజులుగా బీహార్లో విస్తృత ప్రచారం చేశారు. మరోవైపు ఆర్ జెడి నేత తేజస్వి యాదవ్ యువతను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మహాఘాట్ బంధన్ గట్టిగానే పోరాటం చేస్తోంది. మరోవైపు నితీష్ కుమార్ గత రెండు దశాబ్దాలుగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే మాత్రం ఎన్డీఏకు ఇబ్బందికరమే.
కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే..
ఒకవేళ ఇక్కడ మహా ఘాట్ బంధన్ విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీకి ( Congress Party)జవసత్వాలు వస్తాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. ఆ ప్రభావం ఏపీ ఫై కూడా ఉండనుంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కరం. ఇప్పటికే ఆ పార్టీకి చాలా మంది నేతలు గుడ్ బై చెప్పారు. మరికొందరు కూటమి పార్టీల్లో అవకాశం లేక ఉండిపోయారు. అటువంటి వారంతా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కరం. అంతిమంగా అది టిడిపి కూటమికి మేలు చేస్తుంది.
మరోవైపు బీహార్లో ఎన్డీఏ కూటమి ఓడిపోతే మాత్రం తెలుగుదేశం వైఖరిలో మార్పు ఖాయం. ఎందుకంటే 2026లో మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కూడా బిజెపికి, వాటి మిత్రపక్షాలకు ప్రతికూల ఫలితాలు వస్తే చంద్రబాబు యూ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. అయితే అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిజెపి ఆప్షన్ గా మారుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు దూరంగా ఉంటూ వస్తోంది వైయస్సార్ కాంగ్రెస్. అదే సమయంలో బిజెపి పట్ల సానుకూలంగా ఉంది. అయితే ఈ పరిణామాలన్నీ బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.