Minister Nara Lokesh:సైబర్ నేరాల( Cyber crimes) తీరు మారుతోంది. ఇప్పటివరకు సామాన్యులే టార్గెట్ అయ్యేవారు. ఇప్పుడు సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. వీఐపీల పేర్లు, ఫోటోలు వాడుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మొన్న మధ్యన రాయలసీమ జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే ఒకరిని టార్గెట్ చేసి కోటి రూపాయలకు పైగా వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ పేరుతో 57 లక్షల రూపాయలు కొల్లగొట్టేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇది సంచలన అంశంగా మారింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
* వ్యాపారికి బెదిరింపు కాల్స్..
ఏపీకి( Andhra Pradesh) చెందిన ఓ వ్యాపారికి.. మంత్రి నారా లోకేష్ ప్రొఫైల్ పిక్చర్ గా ఉన్న ఓ వాట్సప్ నుంచి సమాచారం వచ్చింది. కీలకమైన ప్రాజెక్టులకు డబ్బు అవసరం ఉందని చెప్పి.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఫోన్ కాల్ చేసి అచ్చంగా మంత్రిగా మాట్లాడారు. అయితే అది నిజమేనని భావించిన సదరు వ్యాపారి పలు విడతల్లో 57 లక్షల రూపాయల వరకు అలా బెదిరించిన వ్యక్తులకు పంపించాడు. చివరకు ఇది మోసంగా భావించి ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతో హైదరాబాదులో సాయి శ్రీనాథ్, సుమంత్ అనే ఇద్దరు వ్యక్తులను హైదరాబాదులో అరెస్టు చేశారు. ఈ ఘటన వెనుక పెద్ద ముఠా హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
* కొద్ది రోజుల కిందట టిడిపి నేతలకు..
కొద్ది రోజుల కిందట ఖమ్మం జిల్లా( Khammam District) టిడిపి నేతలను ఇలానే సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరుతో వాట్సాప్ కాల్ చేశారు. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి నిధులు కావాలని.. అందుకు విరాళాలు అందించాలని కోరడంతో కొందరు నేతలు నగదు పంపించారు. అదే సమయంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో బీఫారాలు కావాలంటే కొంత మొత్తం చెల్లించాలని కోరడంతో.. రెండోసారి కూడా సదరు నేతలు నగదు జమ చేశారు. అమరావతి వస్తే పార్టీ అధినేత చంద్రబాబుతో బీఫారాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. విజయవాడలో వారి పేరుతో హోటళ్లు కూడా బుక్ చేశారు. దీంతో ఇది నిజమని నమ్మిన నేతలు విజయవాడ వెళ్లి హోటల్లో దిగారు. అయితే అక్కడ బిల్లు చెల్లించే క్రమంలో వివాదం జరిగింది. తాము సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డామని గుర్తించిన సదరు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేశారు. బయటకు చెబితే పరువు పోతుందని భావించారు. ఇంకోవైపు రాయలసీమ జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే ఒకరు హైదరాబాదులో ఇలానే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. అయితే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ పేరు చెప్పి సైబర్ నేరానికి పాల్పడడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.