TTD Laddu Case: తిరుమల తిరుపతి దేవస్థానానికి( Tirumala Tirupati Devasthanam) సంబంధించి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదో సంచలన అంశంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో.. ఈ ఘాతుకం జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఇది ప్రకంపనలకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఆందోళనకు గురయ్యారు. అటు తరువాత సుప్రీంకోర్టు కలుగజేసుకుంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విచారణ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి వేదికగా చేసుకొని విచారణ కొనసాగుతోంది. ఈ తరుణంలో టీటీడీ మాజీ అధ్యక్షుడు వై వి సుబ్బారెడ్డి అప్పన్నను దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. దీంతో ఇది సంచలన అంశంగా మారింది.
* సుప్రీం కోర్టు ఆదేశాలతో
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం లడ్డు వివాదం తెరపైకి తెచ్చిన సమయంలో.. టీటీడీ మాజీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి( YV Subba Reddy) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉండకూడదని.. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నేతృత్వంలో.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పోలీసులు, ఆహార కల్తీ నియంత్రణ అధికారులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గత కొన్ని నెలలుగా ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధానంగా నెయ్యి సరఫరా చేసే సంస్థలను, ట్యాంకర్లను అందించే డ్రైవర్లతో పాటు లడ్డు తయారీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ఈ బృందం విచారించింది. అయితే తాజాగా వై వి సుబ్బారెడ్డి పిఏ ను అరెస్టు చేయడం మాత్రం సంచలనంగా మారింది. త్వరలో వైవి సుబ్బారెడ్డిని సైతం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* డాల్డా మిక్సింగ్ తో నెయ్యి..
లడ్డూ తయారీలో జంతు కొవ్వు వాడారు అన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది ఈ విచారణలో. నెయ్యితో డాల్డా మిక్సింగ్ చేసి లడ్డు తయారీకి పంపించారని తెలుస్తోంది. నెయ్యి సరఫరా చేసి సదరు సంస్థలను విచారించగా ఈ సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో సదరు సంస్థల ప్రతినిధుల నుంచి అప్పటి టీటీడీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి పిఎ అప్పన్నకు నగదు లావాదేవీలు నడిచినట్లు విచారణ అధికారులు గుర్తించారు. డాల్డా మిక్సింగ్ చేసిన నెయ్యి సరఫరా చేసినందుకుగాను.. పిఏ అప్పన్న ద్వారా వై వి సుబ్బారెడ్డి కి కమీషన్లు అందినట్లు విచారణ అధికారులు భావిస్తున్నారు. అయితే అప్పన్న ఇదివరకే అప్రూవర్ గా మారారని.. వై వి సుబ్బారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
* నాలుగేళ్లు టీటీడీ అధ్యక్షుడిగా..
వై వి సుబ్బారెడ్డి.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) స్వయానా బాబాయ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వెనుక ఆయన కృషి కూడా ఉంది. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచారు వైవి సుబ్బారెడ్డి. కానీ 2019 ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి కి ఎక్కడ టికెట్ ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత టిటిడి అధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే సాధారణంగా ప్రతి రెండు మూడు సంవత్సరాలకు టీటీడీ అధ్యక్షులు మారడం ఆనవాయితీ. కానీ తొలి నాలుగేళ్లు వైవి సుబ్బారెడ్డి ఆ పదవిలో ఉండిపోయారు. దీనిపై విమర్శలు రావడంతో జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో కరుణాకర్ రెడ్డి కి ఛాన్స్ ఇచ్చారు. అయితే కరుణాకర్ రెడ్డి హయాంలో కంటే వైవి సుబ్బారెడ్డి హయాంలోనే టీటీడీలో అవకతవకులు జరిగినట్లు కూటమి అనుమానిస్తోంది. ఇప్పుడు ఏకంగా వైవి సుబ్బారెడ్డి పిఎ విచారణ అధికారులకు చిక్కడంతో.. ఇక తరువాయి ఆయనేనని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?