AP Elections 2024 : ఏపీలో క్రాస్ ఓటింగ్ జరిగిందా? ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులకు సహకారం అందిందా? దీని వెనుక వైసిపి నేతల హస్తం ఉందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పోలింగ్ ముగిసి పది రోజులు దాటుతోంది. అభ్యర్థులు లెక్కలు తేల్చుకునే పనిలో పడ్డారు. అక్కడక్కడ లోపాలు వెలుగు చూడడంతో ఫలితాలపై ప్రభావం తప్పదని ఆందోళనతో ఉన్నారు. ముఖ్యంగా ఐదు చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగినట్లు గుర్తించారు. అయితే అది అధికార పార్టీకి కాకుండా.. కూటమి అభ్యర్థులకు క్రాస్ జరిగినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అభ్యర్థులను కలవరపాటుకు గురిచేస్తోంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నంద్యాలలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. శ్రీకాకుళం నుంచి టిడిపి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సైతం ఆయనకు క్రాస్ ఓటింగ్ జరిగింది. పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను.. ఐదు చోట్ల టిడిపి ఓడిపోయింది. కానీ అక్కడ ఎంపీగా రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. అప్పట్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈసారి కూడా ఇక్కడ వైసిపి అభ్యర్థి పేరాడ తిలక్ కు పడాల్సిన ఓట్లు.. భారీగా క్రాస్ అయినట్లు తెలుస్తోంది.
విజయనగరం టిడిపి ఎంపీ అభ్యర్థి కలిశేట్టి అప్పలనాయుడు కు క్రాస్ ఓటింగ్ కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. కానీ ఆయనకు ఆశించిన స్థాయిలో ఓటింగ్ జరగలేనట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలే క్రాస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కలిశేట్టిపై సానుభూతి పనిచేస్తోంది. టిడిపిలో ఓ సామాన్య కార్యకర్తగా ఉన్న ఆయనకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన వైపు యువ ఓటర్లు మొగ్గు చూపినట్లు సమాచారం.
విశాఖ నుంచి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ లక్ష్మి వైసిపి అభ్యర్థిగా పోటీ చేశారు. తప్పకుండా విజయం సాధిస్తానని నమ్మకంగా ఉన్నారు. కానీ అక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో వైసిపి విజయంపై ఆశలు సన్నగిల్లాయి.ఇక్కడ టిడిపి అభ్యర్థి భరత్ పై సానుభూతి వ్యక్తం అవుతోంది. యువత పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు తెలిపినట్లు సమాచారం.
అనకాపల్లిలో బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా క్రాస్ జరిగినట్లు సమాచారం. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసిన వారు.. ఎంపీ విషయానికి వచ్చేసరికి.. బిజెపికి వేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ బలమైన అభ్యర్థిగా భావించి.. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును జగన్ రంగంలోకి దించారు. కానీ పెద్దగా వర్క్ అవుట్ కానట్లు తెలుస్తోంది. దాదాపు ఏడు నియోజకవర్గాల్లో క్రాస్ జరిగినట్లు సమాచారం.
నంద్యాల టిడిపి అభ్యర్థి బైరెడ్డి శబరి కి మద్దతుగా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి మంచి పేరు ఉండడం.. అన్ని పార్టీలకు సన్నిహిత సంబంధాలు ఉండడం శబరి కి కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎక్కడికి అక్కడే వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ తరుణంలో వారు సైతం క్రాస్ ఓటింగ్ కు ప్రోత్సహించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అయితే క్రాస్ ఓటింగ్ తో కూటమి ఎంపీ అభ్యర్థులు ఐదుగురు గెలుపు బాట పట్టినట్లు టాక్ నడుస్తోంది.