Big update for AP farmers : ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సరిగ్గా పంటలు చేతికి అంది వస్తున్న సమయంలోనే వర్షాలు నష్టానికి గురిచేసాయి. ఈ తరుణంలో రంగు మారిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు వస్తోంది. అయితే పంటల బీమా చేసుకునే వారికి పరిహారం దక్కే అవకాశం ఉంది. అయితే ఖరీఫ్ లో చాలామంది బీమా చేయించుకోలేదు. అటువంటి వారు ఇప్పుడు నష్టపోతున్నారు. ఇటువంటి తరుణంలో రబీ లోనైనా చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్ లో కేవలం వరి మాత్రమే పండిస్తారు రైతులు. కానీ రబీ వచ్చేసరికి ఆరుతడి పంటలు, అపరాలు ఎక్కువగా పండిస్తుంటారు. వీటికి పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. పొరపాటున పంటలు పోతే మాత్రం తీవ్ర నష్టం తప్పదు. అందుకే ప్రభుత్వం పంటల బీమాకు ప్రోత్సహిస్తుంది. అయితే రబీకి సంబంధించి పంటల బీమా గడువు ఈనెల 15 తో ముగిసింది. అయితే చాలామంది రైతులు ఇంకా బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో గడువును ఈనెల 31 వరకు పెంచినట్లు అధికారులు తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
* రాష్ట్రవ్యాప్తంగా మందకొడిగానే
2024 – 25 సంవత్సరానికి సంబంధించి.. రబీ సీజన్లో పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ అధికారులతో రివ్యూలు జరిపారు. పంటల బీమా పథకాన్ని అమలు చేసేలా.. రైతులు ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని జిల్లాల్లో పంటల బీమాప్రక్రియ కొనసాగింది. అయితే చాలా ప్రాంతాల్లో రైతులు బీమా ప్రీమియం చెల్లింపులు చేయలేదు. ఆ జిల్లాల్లో యంత్రాంగం అవగాహన కల్పించలేదో.. ఇతర కారణాలో తెలియదు కానీ.. బీమా ప్రీమియం చెల్లింపులు మందకుడిగా సాగాయి. ఇటువంటి తరుణంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం గడువును ఈనెల 31 వరకు పొడిగించింది.
* రైతులకు ఎంతో ప్రయోజనం
పంటల బీమా తో రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. రైతులు వాటా కింద ఎకరా విస్తీర్ణంలో వరికి 638 రూపాయలు, వేరుశెనగకు 486, జొన్నకు 319, మొక్కజొన్నకు 525 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అపరాల్లో భాగంగా పెసరకు ఎకరాకు 273, మినుములకు 288, నువ్వులకు 182, సన్ ఫ్లవర్ కు 34, టమాటాకు 1600, మామిడికి 1650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఉల్లితో పాటు ఇతర పంటలకు కూడా ఈసారి అవకాశం ఇచ్చారు. అయితే రైతుల్లో సరైన అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం మరో పది రోజులపాటు గడువు పొడిగించడంతో ఈసారైనా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది