YS Jagan: వరద బాధితుల సహాయార్థం వైసిపి రంగంలోకి దిగింది. పార్టీ అధినేత జగన్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని ప్రకటించారు. ఆ డబ్బులతో వరద బాధితులకు సహాయ చర్యలు పండించేందుకు వైసిపి సిద్ధమైంది. ఇప్పటికే ఆ పార్టీ రెండు దశలలో వరద బాధితులకు సాయం అందించారు. మంగళవారం నుంచి మూడో విడతలో వరద సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నారు. రేషన్ సరుకులతో కూడిన 50వేల ప్రత్యేక ప్యాకెట్లను వరద బాధితులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో లక్ష పాల ప్యాకెట్లు, రెండు లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. రెండో దశలో 75 వేల పాల ప్యాకెట్లు, లక్ష వాటర్ బాటిళ్లు అందించారు. ఈరోజు నుంచి పంపిణీ చేయనున్న స్పెషల్ ప్యాకెట్లను ఆ పార్టీ నేతలు పరిశీలించారు.
* సాయం విషయంలో విమర్శ
వరద బాధితుల సహాయం విషయంలో వైసిపి అనుకున్న స్థాయిలో వ్యవహరించలేక పోయిందన్న విమర్శ ఉంది. విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక సాయం అందించింది. సహాయ చర్యలతో పాటు పునరావాసం కూడా కల్పించింది. మెజారిటీ ప్రజలు ప్రభుత్వ సాయం పై సంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో చాలామంది వైసీపీ నేతలు అసలు వరద సమయంలో కనిపించలేదు. జగన్ రెండుసార్లు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అయితే అప్పట్లో సాయం కంటే ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం అయ్యారన్న విమర్శ ఉంది. కేవలం రాజకీయ విమర్శలకే వరద బాధితులను పరామర్శించారన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు జగన్.
* పవన్ పెద్ద ఎత్తున సాయం
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు పవన్ పెద్ద ఎత్తున సాయం చేశారు. తెలుగు రాష్ట్రాలకు తలో కోటి రూపాయల చొప్పున ప్రకటించారు. దీంతో పాటు 400 పంచాయతీలకు లక్షలు చొప్పున నాలుగు కోట్లు ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో పవన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ తరుణంలో వైసిపి అధినేత జగన్ పై ఒత్తిడి పెరిగింది. అందుకే ఆయన కోటి రూపాయల సాయం ప్రకటించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక నెల జీతం అందించాలని నిర్ణయించారు. ఈ మొత్తం నగదు తో నిత్యవసరాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు విజయవాడలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వరద సమయంలో ఇచ్చి ఉంటే బాగుంటుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ వరదలు తగ్గాక.. సాధారణ పరిస్థితి వచ్చాక ఇవ్వడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
* వైసిపి నేతల పరిశీలన
కాగా వరద బాధిత ప్రాంతాల్లో అందించాల్సిన నిత్యవసర కిట్లను వైసీపీ నేతలు పరిశీలించారు. శాసనమండలిలో వైసిపి పక్ష నేత బొత్స సత్యనారాయణ, ఇతర వైసీపీ నేతలతో కలిసి ఆ కిట్లను పరిశీలించారు. పార్టీ నేతలకు సలహాలు సూచనలు అందించారు. మరోవైపు ఈరోజు పంపిణీకి సంబంధించి వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఓ రాష్ట్రానికి ఐదేళ్లపాటు పాలించిన జగన్ కేవలం కోటి రూపాయలు సాయం ప్రకటించడం, ఎమ్మెల్యేలు, ఎంపీల జీతం లో కోత విధించడం ఆ పార్టీ శ్రేణులకే రుచించడం లేదు. పైగా జగన్ కోటి రూపాయల విరాళం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వకుండా.. నేరుగా తానే నిత్యవసరాలు కొని పంపిణీ చేస్తుండటం కూడా చర్చకు దారి తీస్తోంది.