https://oktelugu.com/

Crickter Ambati Rayudu : క్రికెటర్ అంబటి రాయుడి పొలిటికల్ ఎంట్రీ.. ఆ స్థానాన్ని ఫిక్స్ చేసిన జగన్

గుంటూరు పార్లమెంట్ స్థానంలో కాపులు అధికం. వైసీపీ ఒకసారి కాపు, మరోసారి రెడ్డి సామాజికవర్గానికి టిక్కెట్ ఇచ్చి చేతులు కాల్చుకుంది. ఈసారి మాత్రం కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడును పోటీచేయించేందుకు నిర్ణయించింది.

Written By:
  • Dharma
  • , Updated On : June 7, 2023 / 09:00 AM IST
    Follow us on

    Crickter Ambati Rayudu : అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నాడా? జగన్ కోసం రిస్క్ చేయనున్నాడా? క్రికెట్ కెరీర్ ఉన్నా ఉన్నపలంగా వదిలేస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్నపరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల క్రికెట్ లో అన్ని ఫార్మెట్ లకు దూరమవుతున్నట్టు రాయుడు ప్రకటించాడు. ఇదే తన చివరి మ్యాచ్ అంటూ ప్రకటించాడు. సీఎం జగన్ ను పలుమార్లు కలిసిన తరువాతే రాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. దాదాపు ఆయన రాజకీయాల్లోకి వెళ్లేందుకు డిసైడయిన తరువాతే క్రికెట్ కు గుడ్ బై చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

    అంబటి రాయుడు వైసీపీలో చేరడం లాంఛనమే అని తేలింది.  గుంటూరు పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయబోతున్నారు అని వార్త ఒకటి బయటకు వచ్చింది. ఒక విధంగా ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంతవరకూ వాస్తవం ఉందో కానీ వాస్తవానికి దగ్గరగా ఉందన్న వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంబటి రాయుడు గుంటూరు జిల్లాకే చెందిన వారు. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వారు. క్రికెటర్ గా దేశ వ్యాప్తంగా సుపరిచితులు. అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా పరిమితం చేయడం  తగదని.. పార్లమెంట్ కు పంపడానికి జగన్ డిసైడయినట్టు సమాచారం.

    గత రెండు ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానాన్ని వైసీపీ ఓడిపోయింది. 2014లో బాలశౌరిని నిలబెట్టింది. కానీ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ దాదాపు 70 వేల ఓట్లతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాలరెడ్డికి బరిలో దింపినా ఫలితం లేకపోయింది. నాలుగు వేల ఓట్లతో గల్లా జయదేవ్ రెండోసారి గెలుపొందారు. కారణాలు తెలియవు కానీ.. టీడీపీలో గల్లా జయదేవ్ పెద్దగా యాక్టివ్ గా లేరు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారో లేదో? క్లారిటీ మాత్రం లేదు. అందుకే అప్పుడు రాయుడు బలమైన అభ్యర్థి అవుతారన్న మాట.

    గుంటూరు పార్లమెంట్ స్థానంలో కాపులు అధికం. వైసీపీ ఒకసారి కాపు, మరోసారి రెడ్డి సామాజికవర్గానికి టిక్కెట్ ఇచ్చి చేతులు కాల్చుకుంది. ఈసారి మాత్రం కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడును పోటీచేయించేందుకు నిర్ణయించింది. క్రికెటర్ గా గుర్తింపు ఉండడం, యువకుడు కావడంతో గల్లా జయదేవ్ నైనా ఢీకొట్టే అవకాశముందని వైసీపీ భావిస్తోంది. అన్నింటికీ మించి ఆయనకు నేషనల్ క్రికెట్ టీం లో చోటు లభించలేదు అన్న సానుభూతి అయితే బలంగా ఉంది. ఇవన్నీ కలసి ఆయన గెలుపునకు అవకాశం ఉండవచ్చు అని అంటున్నారు. ఇక క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చి గెలవడం కొత్త కూదా కాదు. భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భారత రాజకీయాల్లో తన ఉనికిని విజయవంతంగా చాటుకోగా మరో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాని అయ్యాడు. ఇలా చాలా మంది పాలిటిక్స్ వైపు ఉత్సాహంగా చూస్తున్నారు. సో ఇపుడు అంబటి రాయుడు వంతు వచ్చిందన్న మాట.