Women Farmer: నేలను తల్లితో ఎందుకు పోల్చుతారంటే.. భూదేవికి ఉన్నంత సహనం తల్లికి కూడా ఉంటుంది కాబట్టి. పిల్లలు ఎంతలా మారం చేసినప్పటికీ.. ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఆ బాధను తల్లి పంటి బిగువన భరిస్తుంది. అందుకే మాతృదేవోభవ అనే నానుడి పుట్టింది. ఇక ఈ సువిశాల భూమ్మీద ఎంతోమంది తల్లులు తమ త్యాగంతో, సేవా నిరతి తో చరిత్ర పుటల్లోకి ఎక్కారు. భావితరాలకు మార్గదర్శకంగా నిలిచారు. అలాంటి కోవలోకి వస్తుంది సంగారెడ్డి నియోజకవర్గంలోని మారుమూల పల్లెకు చెందిన అంజమ్మ. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయేలా ఏకంగా 80 రకాల చిరుధాన్యాలు పండించి విత్తన సంరక్షణ నిధి ఏర్పాటు చేసింది. అంతేకాదు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఏకంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకుంది.
అంజమ్మ సొంత ఊరు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హద్నూర్. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఆమె గ్రామం ఉంటుంది. నిరుపేద ఎస్సీ కుటుంబంలో పుట్టిన ఆమె ఒక్కరోజు కూడా బడికి వెళ్లిన దాఖలాలు లేవు. ఆమెకు పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గంగ్వార్ ప్రాంతానికి చెందిన సంగప్పతో వివాహం జరిగింది. అప్పట్లో వారికి రెండు పూటలా భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ కూలీలుగా భార్యాభర్తలు జీవన సాగించేవారు. ఇలా కష్టపడి ఒక అరికరం భూమి కొనుక్కున్నారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఇక ఇదే సమయంలో ఆ ప్రాంతంలో సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు జహీరాబాద్ ప్రాంతంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కార్యక్రమాలు చేపట్టింది. ఆ సొసైటీలో అంజమ్మ సభ్యురాలిగా చేరింది. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో తన పొలంలో ఆమె చిరుధాన్యాలు సాగు చేశారు. కొత్త మెలకువలను తెలుసుకుంటూ, వివిధ రకాల పంటలు వేశారు. ఆమె శ్రమ మంచి ఫలితాలు ఇచ్చింది. ఇలా ఆమె చేసిన శ్రమ వల్ల ఆర ఎకరం నుంచి పది ఎకరాలు సమకూర్చుకునే స్థాయి దాకా చేరుకున్నారు. నూనె గింజలు, పప్పు దినుసులు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు తదితర చిరుధాన్యాలు పండించారు. ఇప్పటివరకు 80 రకాల చిరుధాన్యాలతో ఏకంగా విత్తన సంపద సృష్టించారు.
ఇక ఈ విత్తన సంరక్షణ నిధిలోని విత్తనాలను ఆమె ఎవరికీ విక్రయించరు. అవసరమైన రైతులకు ఉచితంగానే ఇస్తారు. వారికి దిగుబడి వచ్చిన తర్వాత రెట్టింపు విత్తనాలు తీసుకొని భద్రపరుస్తారు. స్థానిక వాతావరణానికి అనుగుణంగా వివిధ రకాల విత్తనాలను పండిస్తున్న అంజమ్మను మొక్కల జీవవైవిధ్య పరిరక్షకురాలిగా 2019లో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. విత్తన సంరక్షకురాలిగా ఖ్యాతి పొందిన అంజమ్మ నాగాలాండ్, బీహార్, మేఘాలయ, ఒడిశా, అస్సాంతో పాటు 22 రాష్ట్రాల్లో పర్యటించారు. విత్తన సంరక్షణ, సేంద్రియ ఎరువుల తయారీ, మహిళా సంఘాల నిర్వహణ తదితర అంశాల్లో తన అనుభవాలు అక్కడితో పంచుకున్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఆహార, వ్యవసాయ విభాగం ప్రపంచ స్థాయిలో చిరుధాన్యాల రైతులపై అధ్యయనం చేసింది. చిరుధాన్యాలు పండించడం, విత్తనాలను అందజేయడం ద్వారా వాటి సాగును ప్రోత్సహించడంలో అంజమ్మ చేస్తున్న కృషిని గుర్తించి ప్రశంసలు అందించింది.