Chandrababu Bail: స్కిల్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు శుక్రవారం కూడా ఊరట లభించలేదు. ఇటు సీఐడీకి కూడా పెద్దగా లబ్ధి కలుగలేదు. బెయిల్ కోసం చంద్రబాబు, కస్టడీ కోసం సీఐడీ వేసిన పిటిషన్లపై మూడు రోజులు జరిగిన వాదనలు శుక్రవారం ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పు సోమవారం వెల్లడిస్తానని తెలింది.
28 రోజులుగా జైల్లో..
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబు 28 రోజులుగా రాజమండ్రి జైలులోనే ఉన్నారు. ఆయన తరుపున న్యాయవాదులు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ, బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తే చంద్రబాబు సాక్షాలు తారుమారు చేస్తారని సీఐడీ తరఫున న్యాయవాదులు వాదించారు.
కస్టడీ పిటీషన్..
మరోవైపు చంద్రబాబు రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించలేదని, మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తర ఫున న్యాయవాదులు పిటిషన్ వేశారు. మూడు రోజుల వాదనలో కస్టడీకి ఇస్తేనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. స్కిల్ కేసులో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని సీఐడీ తరుపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
తీర్పు రిజర్వు..
రెండు పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. ఇరువర్గాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పు సోమవారం వెల్లడిస్తానని చెప్పింది. సోమవారం చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీం కోర్టులోనూ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో అదే రోజు తీర్పు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.