Chandrababu: తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను చూసింది. ఓటములను అధిగమించి విజయాలను అందుకుంది. దాని వెనుక చంద్రబాబు ఉన్నారని సగటు తెలుగుదేశం అభిమాని బలంగా నమ్ముతారు. ఇప్పుడు కూడా చంద్రబాబునే వారంతా నమ్ముకుంటున్నారు. 2024 ఎన్నికల్లో టిడిపికి విజయం దక్కే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయంలో గత అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమితో తెలుగుదేశం పార్టీ పతనావస్థకు చేరుకున్న తరుణంలో.. 2014లో అధికారంలోకి రావడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య భిన్న వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బాబు అధికారంలోకి రావడం నిజంగా ఆశ్చర్యకర విషయమే.
2014 ఎన్నికల నాటికి రాష్ట్ర విభజన జరిగింది. ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీగా వైసీపీ ఉంది. కానీ తన వ్యూహరచనతో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గెలిపించుకోగలిగారు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. దూరమైన ఎన్ డి ఏ ను దగ్గర చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన మద్దతు పొందగలిగారు. అప్పట్లో కూడా బిజెపికి పొత్తులో భాగంగా ఇచ్చిన సీట్లలో సొంత మనుషులను టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోగలిగారు. ఆ ఎన్నికల్లో గెలుపు మాత్రం ముమ్మాటికీ చంద్రబాబు వ్యూహమేనని టిడిపి శ్రేణులు బలంగా నమ్ముతాయి కూడా.
అయితే తాజా ఎన్నికల్లో సైతం చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముందుగా తక్కువ సీట్లకు పవన్ ను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. కేవలం 24 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేశారు. బిజెపి రాకుండానే అభ్యర్థులను ప్రకటించి.. పవన్ ను బిజెపి నుంచి దూరం చేశారు. కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చంద్రబాబు ఇచ్చిన వాటికే బిజెపి తీసుకోవాలని సంకేతాలు పంపించారు. టిడిపిలోకి రావాల్సిన నేతలను జనసేనలోకి పంపించి టికెట్లు ఇప్పిస్తున్నారు. కొణతాల రామకృష్ణ, బాలశౌరి, సానా సతీష్ వంటి నాయకులకు టిక్కెట్లు ఇప్పించడం వెనుక చంద్రబాబు వ్యూహం దాగి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు జనసేన ను సైతం చంద్రబాబు నడిపిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ పరిణామాలను గమనిస్తున్న టిడిపి శ్రేణులు ఈసారి చంద్రబాబు వ్యూహాలు తమను అధికారంలోకి తెచ్చి పెడతాయని బలంగా నమ్ముతున్నారు. మొత్తానికైతే రాజకీయ చాణుక్యంలో ఆరితేరిన చంద్రబాబు.. ఈ ఎన్నికల్లో మాత్రం అసలు సిసలు రాజకీయం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.