TDP mini Mahanadu: తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) పరిస్థితి గాడి తప్పుతోందా? తమ్ముళ్లు క్రమశిక్షణ తప్పుతున్నారా? అసంతృప్తులు పతాక స్థాయికి చేరుతున్నాయా? దీనికి సీనియర్ ఎమ్మెల్యేలు ఆజ్యం పోస్తున్నారా? వారికి పదవులు రాకపోవడంతో కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ నెల 27 నుంచి కడపలో మహానాడు జరగనుంది. మూడు రోజులపాటు నిర్వహించే మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహించాలని పార్టీ హై కమాండ్ ఆదేశించింది. అయితే ఈ మినీ మహానాడు అసంతృప్తులకు వేదికగా మారింది. తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున అసంతృప్తులు బయటపడుతున్నాయి.
* జ్యోతుల నెహ్రూ రచ్చ..
తూర్పుగోదావరి జిల్లా మహానాడులో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ( Nehru) సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి పార్టీ వీధిన పడేసాయని టాక్ వినిపిస్తోంది. పార్టీ పదవుల నుంచి పొత్తుల వరకు ఆయన ప్రకటనలు చేశారు. చివరకు వ్యక్తిగత అంశాలను సైతం టచ్ చేశారు. జనసేనతో పొత్తు ను తప్పు పట్టేలా మాట్లాడారు. టిడిపి తో పొత్తు నికరం కాదని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని వామపక్షాలు నిర్వీర్యమయ్యాయని చెప్పుకొచ్చారు. ఏపీలో వామపక్షాలకు పట్టిన గతి టిడిపికి పడుతుందని సంచలన కామెంట్స్ చేశారు. జనసేనకు ఎక్కువ పదవులు వెళ్లిపోతున్నాయని కూడా గుర్తుచేసుకొని మాట్లాడారు.
* యువనేతల హల్ చల్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం( Kalyanadurgam) నియోజకవర్గం లో జరిగిన మినీ మహానాడు సైతం వివాదాస్పదంగా మారింది. టిడిపికి చెందిన ఓ యువనేత నానా యాగి చేశారు. కష్టపడి పని చేస్తే తనకు గుర్తింపు లేదని ఆత్మహత్యకు ప్రయత్నించారు. పల్నాడు జిల్లాలో అయితే ఓ ఇద్దరు యువ నాయకులు ఎమ్మెల్యేల తీరుపై బాహటంగానే విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తమ వద్ద ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అయితే మినీ మహానాడు వేదికగా పార్టీలో పెద్ద ఎత్తున అసంతృప్తులు వినిపించడంతో హై కమాండ్ కలవరపాటుకు గురయింది. ఇప్పటివరకు చంద్రబాబు చూసి చూడనట్టుగా ఉండేవారు. కానీ క్షేత్రస్థాయిలో పరిణామాలు రోజురోజుకు మించిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.