AP New Universities: ఏపీ ప్రభుత్వం( AP government) వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏడాది పాలనకు దగ్గరవుతున్న నేపథ్యంలో ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. మరోవైపు రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం, ఏలూరు సమీపంలో అంబేద్కర్ సార్వత్రిక విద్యాలయం ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. స్టడీ సెంటర్ల నిర్వహణలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్ కళాశాలలకు సైతం ఊరట లభించింది. తాగునీటి సమస్య పరిష్కారానికి భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సైతం ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోవైపు సమాచార కమిషనర్ల నియామకానికి సైతం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఏకంగా ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
* ఎట్టకేలకు మార్పు..
రాష్ట్రంలో రెండు కొత్త విశ్వవిద్యాలయాల( universities) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఏర్పాటు కానుంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏలూరు సమీపంలో ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఈ రెండు యూనివర్సిటీల ప్రధాన కార్యాలయాలు హైదరాబాదులో ఉండేవి. ఉమ్మడి ఏపీలో వీటికి అనుబంధంగా స్టడీ సెంటర్లు కొనసాగేవి. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు అలానే కొనసాగుతూ వచ్చాయి. కానీ ఇటీవల వాటి సేవలను నిలిపివేశారు. ఇప్పుడు వాటిని ఆంధ్రప్రదేశ్ కు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* స్టడీ సెంటర్ల నిర్వహణపై..
స్టడీ సెంటర్ల( study centres ) నిర్వహణపై కూడా ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అన్ని స్టడీ సెంటర్లను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొస్తారు. శ్రీశైలం, కూచిపూడి, రాజమండ్రిలో ఉన్న మూడు పీఠాలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి. మరోవైపు రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 63 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అనుమతులను పునరుద్ధరించింది. రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 63 కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ప్రస్తుత సంవత్సరానికి అనుమతులు పొడిగించింది. దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
* తాగునీటి ఎద్దడి పై దృష్టి
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి పై ( water problem)ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగునీటి సమస్య పరిష్కారానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.1702 కోట్లతో ఒక ప్రాజెక్టు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు నివేదికను జాతీయ హౌసింగ్ బ్యాంక్ ఆమోదం కోసం పంపనున్నారు. గత ప్రభుత్వం పట్టించుకోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి జాతీయ హౌసింగ్ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు.