AP ministers threat letters: ఏపీలో( Andhra Pradesh) మావోయిస్టుల కదలికలు తగ్గాయి. మొన్న ఆ మధ్యన విజయవాడ నగరం నడిబొడ్డులో ఓ ఇంట్లో తలదాచుకుంటున్న మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరంతా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి తలదాచుకునేందుకు సామాన్యుల మాదిరిగా విజయవాడలోని ఒక ఇల్లును అద్దెకు తీసుకున్నారు. కానీ నిఘా వర్గాల సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. కాకినాడలో సైతం పెద్ద ఎత్తున మావోయిస్టులు పట్టు పడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే ఏపీలో మావోల కదలిక పూర్తిస్థాయిలో తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీకి చెందిన నలుగురు మంత్రులకు మావోల పేరుతో బెదిరింపు లేఖలు రావడం విశేషం.
ఒకేసారి నలుగురు మంత్రులకు..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు( AP assembly budget sessions ) ఈరోజు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై ఆయన కార్యాలయ సిబ్బంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతలో మరో ముగ్గురు మంత్రులకు ఇదే స్థాయిలో బెదిరింపు లేఖలు రావడం విశేషం. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్ లకు లేఖలు రావడం విశేషం. అయితే వీరందరికీ ఒక దగ్గర నుంచి లేఖలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు మావోయిస్టుల హిట్ లిస్టులో ఈ నలుగురు మంత్రులు లేరు. ఎందుకంటే వీరిలో ముగ్గురు కొత్తగా మంత్రులుగా ఎన్నికయ్యారు. ఇద్దరు తొలిసారిగా ఎమ్మెల్యేలు అయ్యారు. మావోయిస్టులు టార్గెట్ చేసుకునే పరిస్థితిలో వీరు లేరు. అయితే ఇప్పుడు మావోయిస్టుల పేరుతో లేఖలు రావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.
భద్రత కట్టుదిట్టం..
బెదిరింపు లేఖలు వచ్చిన నేపథ్యంలో పోలీస్ శాఖ( police department) స్పందించింది. సచివాలయంలో మంత్రులకు భద్రత పెంచడమే కాకుండా.. వారి సొంత నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్లకు కీలక సమాచారం ఇచ్చింది. మరోవైపు ఈ లేఖలు రాసినది ఎవరు? అనే విషయంపై ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఏపీలో మావోయిస్టుల ప్రభావం అస్సలు లేవని పోలీసు వర్గాలు చెబుతుండగా.. ఈ లేఖల కలకలం తీవ్ర చర్చకు దారితీసింది. షెల్టర్ జోన్ గా మావోయిస్టులు రాష్ట్రం వైపు వచ్చిన తరుణంలో పట్టుబడ్డారు. గత ఏడాది నవంబర్లో మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా మరణించడం మావోయిస్టులకు ఎదురు దెబ్బ. అదే సమయంలో ఏపీ వైపు వచ్చిన మావోయిస్టులు పెద్ద ఎత్తున పట్టు పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఈ లేఖలు రాసి ఉండే అవకాశం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు అరాచక శక్తులు ఈ లేఖలు రాసి ఉంటాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.