https://oktelugu.com/

Ap congress : తెలంగాణ మాదిరిగా ఏపీలో కాంగ్రెస్ బలోపేతం.. చంద్రబాబు మార్క్ స్కెచ్!

కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు. అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ప్రత్యామ్నాయంగా వైసిపి కనిపించింది. ఆ పార్టీలో పెద్ద ఎత్తున నాయకులు చేరారు. 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. పార్టీ గౌరవప్రదమైన సీట్లను సొంతం చేసుకుంది. ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లో కూడా గౌరవం పొందింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. గత ఐదు సంవత్సరాలు పాలించింది.

Written By:
  • Dharma
  • , Updated On : July 13, 2024 / 09:56 AM IST
    Follow us on

     

    Ap congress : వైసీపీ సీనియర్లకు ఏమైంది? ఓటమి తర్వాత వారు కనిపించడం లేదు ఎందుకు? ఎందుకు సైలెంట్ అయ్యారు? పక్క చూపులు చూస్తున్నారా? ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారా? వైసీపీతో లాభం లేదనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చాలామంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి. కెసిఆర్ స్నేహితుడు జగన్ పార్టీ నుంచి సైతం ఇప్పుడు చేరికలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా వైసీపీ సీనియర్లు సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

    కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు. అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ప్రత్యామ్నాయంగా వైసిపి కనిపించింది. ఆ పార్టీలో పెద్ద ఎత్తున నాయకులు చేరారు. 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. పార్టీ గౌరవప్రదమైన సీట్లను సొంతం చేసుకుంది. ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లో కూడా గౌరవం పొందింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. గత ఐదు సంవత్సరాలు పాలించింది. అయితే పదేళ్లపాటు వైసీపీలో గడిపిన సీనియర్లకు సరైన గౌరవం దక్కలేదన్న కామెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా జగన్ వ్యవహార శైలి పై అభ్యంతరాలు ఉన్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు సైతం జగన్ వ్యవహార శైలి పై నొచ్చుకున్నారు. తన తండ్రితో పని చేశారన్న కనీస గౌరవం లేకుండా వ్యవహరించారని ఆనం రామనారాయణ రెడ్డి లాంటి నేతలు ఆవేదన వ్యక్తపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ లాంటి సీనియర్లు పార్టీలో అసౌకర్యంగానే ఉండేవారు. కానీ ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో వైసీపీలో కొనసాగారు. అయితే ఇప్పుడు పార్టీకి ఘోర పరాజయం ఎదురు కావడంతో.. వారు బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఆ ప్రభావం సైతం తోటి తెలుగు రాష్ట్రంపై పడక తప్పదు. పైగా చంద్రబాబు హైదరాబాదులో పర్యటించిన తరువాత ఈ చేరికలు పెరిగాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే చంద్రబాబు ఏపీ సీఎం అన్న సంగతి మరిచిపోకూడదు. తప్పకుండా వైసీపీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. హైదరాబాదులో కాంగ్రెస్ లో చేరికలను ప్రోత్సహించిన చంద్రబాబు.. ఏపీలో సైతం అదే ఫార్ములాను అనుసరిస్తారు. అటు నేతలకు ప్రత్యామ్నాయంగా కూడా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. వారి పూర్వశ్రమం కూడా కాంగ్రెస్ పార్టీయే. వారిని ఇష్టపూర్వకంగా, బలవంతంగా పంపించేందుకు చంద్రబాబు శక్తియుక్తులను వాడుతారు. తప్పకుండా వైసీపీ సీనియర్లను హస్తం గూటికి చేర్చుతారు.

    జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. దాని మిత్రపక్షాలు సైతం బలం పెంచుకుంటున్నాయి. వచ్చే ఏడాది చాలా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ పాగా వేసే అవకాశాలు ఉన్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి రావడంతో.. సహజంగానే ఆ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సానుకూలత వస్తుంది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందో.. అక్కడే పాగా వెయ్యాలని రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీలోని వైసీపీ నేతలకు ఆయన టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మరి కొద్ది రోజులు వేచి చూసి.. కాంగ్రెస్ లోకి జంప్ చేయాలని వైసిపి నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి తో పనిచేసిన నేతలంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సీనియర్లు స్తబ్దుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం చాప కింద నీరులా కేసుల నమోదు ప్రక్రియను ప్రారంభించింది. అప్పట్లో వైసీపీ సర్కార్కు సహకరించి.. తమను ఇబ్బంది పెట్టిన అధికారులపై వెంటాడుతున్నారు. మరోవైపు కేసులతో ఉక్కు పాదం అవుతున్నారు. దీంతో వైసిపి సీనియర్లు బెదిరిపోతున్నారు. కేసుల నుంచి తప్పించుకోవాలంటే పార్టీ మారడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. కానీ కూటమిలోని ఆ మూడు పార్టీల్లో ఛాన్స్ లేదు. ఒకవేళ చేరినా భవిష్యత్తు ఉండదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఉత్తమమని ఒక నిర్ణయానికి వస్తారు. చంద్రబాబు కూడా కావాల్సింది అదే. కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే.. వైసిపి అంత బలహీన పడుతుంది. ఆ దిశగా చంద్రబాబు పావులు కదుపుతారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారన్న చంద్రబాబు పై ఉంది. అటువంటిది తన రాష్ట్రంలో చెయ్యరా? అంటే తప్పకుండా చేస్తారనే సమాధానం వినిపిస్తోంది.