Women Wimbledon Final 2024: క్రెజికోవా రెండో గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకుంటుందా? పావోలిని బోణి కొడుతుందా? నేడు మహిళల వింబుల్డన్ ఫైనల్..

వింబుల్డన్ చరిత్రలో 2016లో అమెరికన్ నల్ల కలువ సెరెనా విలియమ్స్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత ప్రతి సీజన్లోనూ కొత్త ఛాంపియన్ అవతరించింది. ఈసారి కూడా అదే చరిత్ర పునరావృతమైంది. వాస్తవానికి ఈసారి వింబుల్డన్ పోటీలు మొదలైన తర్వాత గత చాంపియన్లు మళ్లీ విజేతలుగా ఆవిర్భవిస్తారని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలు తలకిందులయ్యాయి. సంచలన విజయాలు నమోదు కావడంతో గత విజేతలు ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 13, 2024 9:29 am

Women Wimbledon Final 2024

Follow us on

Women Wimbledon Final 2024: ఈసారి వింబుల్డన్ లో సంచలనాలు నమోదయ్యాయి. అనూహ్య ఫలితాలు వచ్చాయి. చరిత్రలో ఎన్నడూ లేనంత ఉత్కంఠగా ఈసారి పోటీలు జరిగాయి. అగ్రశ్రేణి క్రీడాకారిణులు, టైటిల్ ఫేవరెట్ లు ఇంటిదారి పట్టగా.. ఏమాత్రం అంచనాలు లేని క్రీడాకారిణులు క్రెజి కోవా, పావోలిని ఫైనల్ దాకా వెళ్లారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా సరే కొత్త ఛాంపియన్ గా అవతరిస్తారు.

హోరాహోరీగా జరిగిన వింబుల్డన్ పోటీలలో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రెజి కోవా, ఇటలీ దేశానికి చెందిన పావోలిని ఫైనల్ వెళ్లడం ఇదే మొదటిసారి. పావోలిని ప్రస్తుతం ఏడవ ర్యాంకులో కొనసాగుతోంది. వింబుల్డన్ పోటీలలో ఆమె ఎప్పుడూ తొలి రౌండ్ గండాన్ని అధిగమించలేదు.. 2021లో క్రెజికోవా నాలుగో రౌండ్ చేరింది. ఆ తర్వాత మరోసారి ఆ స్థాయి ప్రదర్శన చూపలేదు.

వింబుల్డన్ చరిత్రలో 2016లో అమెరికన్ నల్ల కలువ సెరెనా విలియమ్స్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత ప్రతి సీజన్లోనూ కొత్త ఛాంపియన్ అవతరించింది. ఈసారి కూడా అదే చరిత్ర పునరావృతమైంది. వాస్తవానికి ఈసారి వింబుల్డన్ పోటీలు మొదలైన తర్వాత గత చాంపియన్లు మళ్లీ విజేతలుగా ఆవిర్భవిస్తారని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలు తలకిందులయ్యాయి. సంచలన విజయాలు నమోదు కావడంతో గత విజేతలు ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

పావోలిని ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్లో ఓటమిపాలైంది. ఆమెకు ఇది వరుసగా రెండవ గ్రాండ్ స్లామ్ ఫైనల్. ఈ సీజన్లో ఆమె వరుసగా రెండు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ వెళ్లడం విశేషం. సెరేనా విలియమ్స్ 2016లో వరుసగా రెండు గ్రాండ్ స్లామ్స్ ఫైనల్స్ వెళ్లి రికార్డు సృష్టిస్తే.. ఇప్పుడు పావోలిని ఆ రికార్డును సమం చేసింది.

ప్రస్తుతం సాగుతున్న టెన్నిస్ ఓపెన్ శకంలో పావోలిని వింబుల్డన్ ఫైనల్ ఆడుతోంది. ఇలా ఆడుతున్న తొలి ఇటలీ అమ్మాయిగా పావోలిని అరుదైన ఘనతను సాధించింది. ఇక టెన్నిస్ చరిత్రలో పావోలిని, క్రెజికోవా ఒకసారి తలపడ్డారు. 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్ లో తొలిసారి వీరిద్దరూ పోటీపడ్డారు. అప్పుడు క్రెజికోవా విజయం సాధించింది. పావోలిని ఇంతవరకు ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవకపోగా.. క్రెజికోవా మాత్రం 2021 ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా ఆవిర్భవించింది.

అయితే ఈసారి వింబుల్డన్ పోటీలకు మరింత ఆకర్షణ తీసుకొచ్చేందుకు నిర్వాహకులు సరికొత్త ప్రణాళికలు రూపొందించారు. వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన ఆటగాళ్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు. టెన్నిస్ క్రీడతో వారికి ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే విధంగా ప్రశ్నలు అడిగారు. ఇలా వింబుల్డన్ పోటీలకు హాజరైన వారిలో మన దేశం నుంచి ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్ ఉన్నారు.. ఆయన పోటీలకు హాజరై.. ఆసాంతం ఆసక్తిగా తిలకించారు. ఇంగ్లాండ్ క్రికెట్ క్రీడాకారులు సైతం వింబుల్డన్ మ్యాచులకు హాజరయ్యారు. ప్రత్యేక కోట్ లు ధరించి మైదానంలో ఆకర్షణగా నిలిచారు. వింబుల్డన్ నిర్వాహకులు వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన ఆటగాళ్లను ప్రత్యేకంగా సన్మానించారు.. వారికి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. ఇక మహిళల వింబుల్డన్ ఫైనల్ పోటీలలోనూ పలువురు క్రీడాకారులు సందడి చేయనున్నారు. ఇప్పటికే వింబుల్డన్ నిర్వాహక కమిటీ వారికి ఆహ్వానాలు పంపింది. వింబుల్డన్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తీసుకొచ్చేందుకే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహక కమిటీ చెబుతోంది. దీనివల్ల వర్ధమాన క్రీడాకారులు టెన్నిస్ పై మరింత మక్కువ పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని నిర్వాహక కమిటీ బాధ్యులు చెబుతున్నారు. అయితే గతంలో టెన్నిస్ పై అమెరికా క్రీడాకారులదే ఆధిపత్యం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో అది క్రమేపీ తగ్గుతోంది.