Pulivendula Politics: పులివెందుల( pulivendula ) జడ్పిటిసి ఉప ఎన్నిక వైపు రాష్ట్రమంతా చూస్తోంది. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ జడ్పిటిసి గా ప్రాతినిత్యం వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఎక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. సాధారణంగా ఏదైనా కారణంతో సదరు సభ్యుడు మరణిస్తే.. ఉప ఎన్నిక వస్తే ప్రత్యర్థులు పోటీ చేయరు. సానుభూతితో అదే కుటుంబానికి చెందిన వ్యక్తికి ఆ పదవి ఇస్తారు. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి చనిపోగా.. ఆయన కుమారుడ్ని బరిలో దించింది ఆ పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సీట్ను ఎలాగైనా చేజిక్కించుకొని జగన్మోహన్ రెడ్డికి గట్టి సవాల్ ఇవ్వాలని భావిస్తోంది. ఇక్కడ గెలుపొందడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని భావిస్తోంది. అందుకే వ్యూహాలు పన్నుతోంది. తెర వెనుక కొన్ని అస్త్రాలను బయటకు తీసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయాలని చూస్తోంది.
Also Read: ‘హైదరాబాద్’ నుంచి ‘ఏపీ పాలన’!?
* అధికార కూటమిలో ధీమా..
పులివెందుల మండలంలో పదివేల ఓట్ల వరకు ఉంటాయి. ఇక్కడ విజయం దక్కించుకోవాలంటే ఓ అయిదు వేల ఓట్లు కొల్లగొడితే సాధ్యం. అయితే అధికార పార్టీగా సులువుగా ఓట్లు సాధిస్తామని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీలో గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం ఇక్కడ 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టిడిపి, వైసీపీ మధ్య. టిడిపి అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డి ఉన్నారు. దీంతో బీటెక్ రవి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దీంతో రోజురోజుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. అధికార పార్టీ దూకుడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం బేజారు అవుతోంది.
* వివేకా హత్య కేసు ప్రభావం
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సైతం ఇక్కడ రంగంలో ఉన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్( Sunil Yadav) సైతం పోటీ చేస్తున్నారు. దీంతో వివేకానంద రెడ్డి హత్య అంశం మరోసారి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైయస్ వివేకానంద రెడ్డి తెర వెనుక ఉండి వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ తరుణంలో టిడిపి కూటమి ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడటం ఖాయం. ప్రస్తుతం అవినాష్ రెడ్డి వైసీపీ తరఫున గట్టి ప్రయత్నాల్లో ఉండడంతో.. వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. మరోవైపు సునీల్ యాదవ్ సైతం రంగంలో ఉండడంతో.. ఆయన చెప్పే మాటలు సైతం ఈ ఎన్నికల్లో పని చేస్తాయి. ఇలా ఎలా చూసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు.
* వైసీపీకే ఎక్కువ నష్టం..
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ ఓడిపోయినా ఆ పార్టీకి వచ్చే నష్టం లేదు. గట్టి పోటీ ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పదని సంకేతాలు ఇవ్వవచ్చు. పైగా ఆ సీటు తమది కాదని తేల్చి పారేయవచ్చు. కానీ పొరపాటున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం రాష్ట్ర స్థాయిలో ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కిందిస్థాయి క్యాడర్ ప్రలోభాలకు గురవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒకవైపు అధికార టిడిపి, ఇంకోవైపు కాంగ్రెస్ అభ్యర్థి, మరోవైపు సునీల్ యాదవ్ పోటీ చేస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరి ఆ పార్టీ ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.