YCP: వైసీపీ తనకు తానే పరీక్ష పెట్టుకుంది. కానీ అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ కాలేదు. అందుకే దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రజల్లో నవ్వుల పాలయింది. ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం చవిచూసింది. ఎంతలా అంటే 175 సీట్లకు 175 గెలుస్తామని బలంగా చెప్పుకొచ్చింది. కానీ కనీసం 11 స్థానాలు కూడా ఆ పార్టీకి దక్కలేదు. దీంతో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకం అవుతోంది. ఇక పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న నేతలు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. అయితే ఇలా పార్టీకి గుడ్ బై చెబుతున్న వారి విషయంలో కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీ నాయకత్వానికి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలే అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూటమికి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్న వైసిపి ప్రజల్లోకి వచ్చేందుకు నిర్ణయించింది. అయితే దారుణ పరాజయంతో నైరాస్యంలో ఉన్న పార్టీ శ్రేణులను సరైన రీతిలో అప్రమత్తం చేయలేకపోయింది.
* కానరాని జనం
రాష్ట్రవ్యాప్తంగా రైతు సమస్యలపై ఈరోజు వైసిపి పోరాటానికి దిగింది. రైతుకు మద్దతు ధర కల్పించడంతోపాటు సాగు ప్రోత్సాహం అందించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసిపి నాయకత్వం. అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున జనాలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నది వ్యూహం. కానీ చాలా జిల్లాల్లో జనం లేక నిరసన కార్యక్రమాలు నిరసించాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా.. వైసీపీకి క్షేత్రస్థాయిలో బలం లేదన్న వాదన తెరపైకి వచ్చింది. ఇది పార్టీ శ్రేణుల్లో మరింత ఆందోళనకు గురిచేసింది.
* మరి కొంత సమయం ఇచ్చి ఉంటే..
కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తే బాగుంటుందన్న వాదన తెరపైకి వస్తోంది. కేవలం ఆవేశపూరితంగా వైసిపి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. కొద్దిరోజుల పాటు సమయం ఇచ్చి తరువాత ఆందోళన కార్యక్రమాలు చేపడితే కొంత ఫలితం ఉంటుందన్నది విశ్లేషకుల వాదన. ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం ఏదో చేస్తోందన్న సంతృప్తితో ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వంటివి జరిగితేనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసేది. అయితే దానికి కొంత సమయం పడుతుంది. కానీ అది ఏది చూసుకోకుండా వైసిపి నాయకత్వం ఆందోళనలకు పిలుపునివ్వడం విమర్శలకు గురవుతోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వైసిపి ఆందోళన కార్యక్రమాల్లో సీరియస్ లేకపోవడం ఆ పార్టీ శ్రేణులను మరింత గందరగోళానికి గురిచేసింది.