Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ కేసు నమోదుచేసింది. విశాఖలో పాలనా వికేంద్రకరణ సభను అడ్డుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నించారంటూ అభియోగం మోపుతూ పవన్ కళ్యాణ్, నాదేండ్ల మనోహర్ పై ఫిర్యాదు చేసినట్టు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ తెలిపారు. విశాఖలో ఘటనలకు బాధ్యులను చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు వివరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మీడియాతో మాట్లాడిన ఉదయ్ కిరణ్ తమ ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వీకరించిందని.. కేసు నమోదుచేసినట్టు చెప్పారు.

వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ విశాఖ గర్జనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు, వైసీపీ కీలక నాయకులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని ముగించుకొని వారంతా విజయవాడ తిరుగు పయనమయ్యారు. ఈ నెల 15 సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టకు చేరుకున్నారు. అదే సమయంలో జనవాణి కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ విశాఖ వస్తున్నారు. అప్పటికే వేలాది మంది జనసేన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. వైసీపీ మంత్రుల రాకతో అక్కడ నినాదాలు హోరెత్తాయి. ఈ క్రమంలో తోపులాట జరిగింది. మంత్రుల వెహికల్స్ పై జనసేన శ్రేణులు దాడిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే పరిణామ క్రమంలో జరిగిన పరిణామాలకు పవన్ తో పాటు నాదేండ్ల మనోహర్ ను బాధ్యులను చేస్తూ జాతీయ బీసీ సంఘం జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

కాగా ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడికి బాధ్యులను చేస్తూ జనసేన నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఇందులో జనసేన వీర మహిళలు సైతం ఉన్నారు. కోన తాతారావు, పీతల మూర్తి యాదవ్, విశ్వస్ క్షేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్ రెడ్డి, పీవీఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, పాలవలస యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజు తదితర జనసేన నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు. అందులో కొందరికి షరతులతో కూడిన బెయిల్ లభించింది. మరికొందరు ఇప్పటికీ కస్టడీలో ఉన్నారు. జనసేన నాయకులు కొందరిపై పోలీసులు మిస్ బిహేవ్ చేసినట్టు కథనాలు వచ్చాయి. అయితే కేసులను స్ట్రాంగ్ గా ఎదుర్కొవాలని సూచించిన పవన్ మంగళగిరి వెళ్లి వైసీపీ నేతల తీరుపై గట్టి కౌంటరే ఇచ్చారు. ఈ క్రమంలో జాతీయ బీసీ సంఘం ప్రతినిధులు జాతీయ మానవహక్కుల కమిషన్ తలుపులు తట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.