SVBC Chairman Post : ఇప్పుడు అందరి దృష్టి ఎస్వీబీసీ చైర్మన్ పోస్ట్ పై పడింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ది ప్రత్యేక స్థానం. స్వామివారి సేవలో ఈ ఛానల్ ముందుంటుంది. టీటీడీ అనుబంధ విభాగాల్లో కీలకమైనది. ఎంతో పలుకుబడి ఉన్నది కావడంతో టీడీపీ, జనసేన, బిజెపి నుంచి ఎక్కువమంది ఆశావహులు ఉన్నారు. ఎస్వీబీసీ చైర్మన్ పోస్టును దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ తో పాటు సీఈవో, ఈసిఓ, చీఫ్ అడ్వైజర్ పదవుల భర్తీ కోసం కసరత్తు జరుగుతోంది. వైసిపి హయాంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఈ పదవిని దక్కించుకున్నారు. కానీ వివాదాల్లో చిక్కుకొని ఉన్నపలంగా ఆ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే వైసీపీలో ఒక వర్గం కుట్ర చేసి తనకు పదవి నుంచి దూరం చేసిందని పృథ్వి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి దూరమయ్యారు. ప్రస్తుతం జనసేన లో పనిచేస్తున్నారు. పృధ్విరాజ్ తర్వాత వైసీపీ సీనియర్ నేత సాయి కృష్ణ యాచేంద్ర మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్ పోస్ట్ భర్తీకి ప్రభుత్వం పావులు కదుపుతోంది. మూడు పార్టీల నేతలు తమ ప్రయత్నాల్లో ఉన్నారు.
* తొలిసారిగా రాఘవేంద్రరావు
ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసిన తరువాత 2018లో తొలిసారిగా చైర్మన్ గా దర్శకుడు కె రాఘవేంద్రరావు నియమితులయ్యారు. అనతి కాలంలోనే ఆ చానల్ ను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటుడు పృథ్విరాజ్ కు ఛాన్స్ ఇచ్చింది. ఆయన తరువాత సినీ పరిశ్రమ నుంచి కాకుండా రాజకీయ నేతను నియమించింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో మరోసారి ఈ చైర్మన్ పోస్టులో సినిమా వారికి అవకాశం ఇవ్వాలని చూస్తోంది. అయితే ఈసారి అనూహ్యంగా జర్నలిస్ట్ వర్గాలనుంచి సైతం పోటీ ఉంది. అయితే పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ఆశావహుల పేర్లు తెరపైకి వచ్చాయి. అదే సమయంలో ఈ పదవిని జనసేనకు కేటాయించాలన్న డిమాండ్ కూడా ఉంది.
* జనసేన నుంచి ప్రయత్నాలు
ఎస్వీబీసీ చైర్మన్ పోస్ట్ కోసం చాలామంది ఆశావాహులు ఉన్నారు.ఆది నుంచి దర్శకుడు రాఘవేంద్రరావు టిడిపికి అనుకూలంగా ఉండేవారు. అశ్విని దత్ తోపాటు మురళీమోహన్ యాక్టివ్ గా పని చేశారు. ఆ ఇద్దరూ టీటీడీ ట్రస్ట్ బోర్డు పదవికి ప్రయత్నించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా బిఆర్ నాయుడుకు ఆ ఛాన్స్ దక్కింది. ఇప్పుడు ఎస్విబిసి చైర్మన్ పోస్ట్ కోసం సినిమా వాళ్లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జనసేన తో పాటు టిడిపి నుంచి ఆ ప్రయత్నాల్లో చాలామంది ఉన్నారు. మరి ఆ పదవి ఎవరికి వరిస్తుందో చూడాలి.