https://oktelugu.com/

Budget 2024-AP : దట్ ఈజ్ చంద్రబాబు.. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం.. వెనుక కథే నడిచిందట.

చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పింఛన్ పెంపు అమలు చేసి చూపించారు. ఇప్పుడు కేంద్రం నుంచి అమరావతి తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సాధించారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 23, 2024 / 04:13 PM IST
    Follow us on

    Budget 2024-AP : రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతోంది. కానీ గత తొమ్మిది సార్లుగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కు భిన్నంగా ఉంది.. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్టిన బడ్జెట్. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. ఏడు మాసాలకు సంబంధించి బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టింది. ఏపీ పై కొంత మేరకు వరాల జల్లు కురిపించిందనే చెప్పాలి. ఆశించిన దానిలో సగం లోపే ఉన్నా.. గత తొమ్మిదేళ్ల బడ్జెట్ తో పోల్చుకుంటే మాత్రం ఆశాజనకంగానే కేటాయింపులు ఉండడం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ ప్రజలు సంతృప్తి చెందే బడ్జెట్ ఇది.

    * నవ్యాంధ్రకు దక్కని సాయం
    2014లో తొలిసారిగా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏపీలో టిడిపి తో కలిసి బిజెపి పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరింది. రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపి రెండు మంత్రి పదవులు, కేంద్రంలో టిడిపి రెండు మంత్రి పదవులను దక్కించుకున్నాయి. ఇక నవ్యాంధ్రప్రదేశ్ కు తిరుగు లేదని అంతా భావించారు. అమరావతి రాజధాని తో పాటు పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు వస్తాయని అందరూ అంచనా వేశారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. అంతులేని మెజారిటీ రావడంతో ఏపీని కేంద్రం పట్టించుకోలేదు. ఏపీలో ప్రత్యామ్నాయంగా వైసిపి ఉండడంతో కేంద్రం రాజకీయ క్రీడ ఆడింది.దీంతో ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు.కేంద్రం నుంచి పూర్తిగా సాయం నిలిచిపోయింది.

    * రుణాలతోనే గడిపేసిన వైసిపి
    2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తనకు ఎంపీ స్థానాలు అధికంగా ఇస్తే ప్రత్యేక హోదా తో పాటు విభజన హామీలను సాధిస్తానని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించారు. 22 ఎంపీ స్థానాలతో పాటు 151 అసెంబ్లీ సీట్లను ఇచ్చారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కేంద్రం. అమరావతి స్థానంలో వైసిపి మూడు రాజధానులను తెచ్చింది. కనీసం ముందడుగు వేయలేకపోయింది. ఇదే అదునుగా కేంద్ర ప్రభుత్వం సైతం సాయం చేసే ఛాన్స్ లేకుండా పోయింది.కానీ ఈసారి మాత్రం చంద్రబాబు పట్టు పట్టి మరి బడ్జెట్లో నిధులు తెప్పించుకున్నారు. కేటాయింపులు చేసుకున్నారు.

    * కూటమికి ప్రచారాస్త్రంగా..
    వైసిపి ప్రభుత్వ హయాంలో బడ్జెట్లో కేటాయింపులు కంటే.. రుణ పరిమితిలో మినహాయింపులకే జగన్ సర్కార్ ప్రాధాన్యం ఇచ్చింది. వార్షిక రుణ పరిమితి ముగిసినా.. అడ్డగోలుగా అప్పులు చేసేందుకు కేంద్రం నుంచి అనుమతులు పొందేది. దానినే కేంద్రసాయంగా పరిగణించేది. కేవలం సంక్షేమం రీత్యా గట్టెక్కుతున్నామా? లేదా? అనే ఆలోచన చేసేది. అదే ఏపీకి శాపంగా మారింది. ప్రజలు గుర్తించి వైసిపిని అధికారం నుంచి దూరం చేశారు. చంద్రబాబుకు అనుకొని అవకాశంగా 16 ఎంపీ స్థానాలు దక్కాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కు అవే కీలకంగా మారాయి. దీంతో చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు సాధించుకోగలిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దటీజ్ చంద్రబాబు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెగ ప్రచారం చేసుకుంటున్నారు.