YS Jagan Vs Pawankalyan : పవన్ వైవాహిక జీవితంపై జగన్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహు భార్యత్వం గురించి మరోసారి ప్రస్తావించారు. ఆయనలా నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేమంటూ ఎద్దేవా చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కురుపాం మండలంలో అమ్మఒడి నగదు సాయాన్ని బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. తల్లుల ఖాతాలో అమ్మఒడి నగదును జమ చేశారు. ఈ సందర్భంగా పవన్ ను టార్గెట్ చేసుకున్నారు. దత్తపుత్రుడు, నాలుగు పెళ్లుళ్లు అంటూ వ్యాఖ్యానించారు. సభలో సీఎం జగన్ ఎక్కువగా పవన్ గురించే మాట్లాడడం విశేషం. వారాహి యాత్రలో తనతో పాటు వైసీపీ నేతలను టార్గెట్ చేసిన నేపథ్యంలో జగన్ ఇప్పుడు పవన్ కు కౌంటర్ అటాక్ ఇచ్చారు.
దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్లు అంటూ జగన్ గతంలో చాలా సందర్భాల్లో పవన్ పై కామెంట్స్ చేశారు. అప్పట్లో పవన్ కూడా ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడొద్దని హితవుపలికారు. ఇష్టపూర్వకంగా విడాకులు ఇచ్చాకే తాను వివాహాలు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. వైసీపీ నేతల్లా తాను స్టెప్నీలను పెట్టుకోలేదని కూడా ఎద్దేవా చేశారు. మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేస్తే.. అంతకు మించి కామెంట్స్ ఉంటాయంటూ హెచ్చరికలు పంపారు. అయినా సరే వైసీపీ నేతల్లో తీరు మారలేదు. సాక్షాత్ సీఎం జగనే మరోసారి పవన్ వైవాహిక జీవితంపై మాట్లాడారు.
ఇటీవల వారాహి యాత్రలో పవన్ వైసీపీ నేతలను టార్గెట్ చేసుకున్నారు. సీఎం జగన్ పై సైతం ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. వైఎస్ హయాంలో పంచాయితీలు చేసి సంపాదించారని.. పోలీస్ స్టేషన్ లోనే ఓ ఇన్ స్పెక్టర్ ను కొట్టారంటూ వ్యాఖ్యానించారు. వీటికి ఎలా రిప్లయ్ ఇవ్వాలో తెలియకే జగన్ మళ్లీ పవన్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించి ఉంటారని జన సైనికులు భావిస్తున్నారు. అయితే తనపై వ్యక్తిగత విమర్శలు వద్దన్నా పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చూస్తుంటే వ్యూహాత్మక దాడికే వైసీపీ శ్రేణులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా పవన్ పై వ్యక్తిగత హననానికి పాల్పడుతునే ఉన్నారు. దత్తపుత్రుడుతో పాటు మూడు పెళ్లిళ్లు అంటూ గుచ్చిగుచ్చి మాట్లాడుతున్నారు. రోజుకు కోట్లు గడించే చాన్స్ ఉందని.. అటువంటి తాను ఎందుకు ప్యాకేజీకి అమ్ముడుపోతానని.. ప్రభుత్వానికి నిజాయితీగా వృత్తి పన్ను కడుతున్నానని.. తనకు వచ్చిన ఆదాయంతోనే పార్టీని నడుపుతున్నానని చాలా సార్లు పవన్ చెప్పుకొచ్చారు. తనను మరోసారి దత్తపుత్రుడు అంటే చెప్పుతో కొడతానని కూడా హెచ్చరించారు. అయినా సరే వైసీపీ నేతలు తగ్గడం లేదు. సాక్షాత్ సీఎం అటువంటి వ్యాఖ్యలు చేసి పార్టీ శ్రేణులకు పురమాయిస్తున్నారని జన సైనికులు ఆగ్రహంగా ఉన్నారు. కాగా సీఎం జగన్ వ్యాఖ్యలపై పవన్ స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుందని జనసేన పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.