Vivekananda Reddy murder case : వైఎస్ వివేకానంద రెడ్డి( vivekanandha Reddy ) హత్య అంశం మరోసారి చర్చకు వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు పురోగతి బాగుంటుందని అంతా ఆశించారు. కానీ ఇంతవరకు అడుగు ముందుకు పడడం లేదు. విచారణ వేగవంతం కావడం లేదు. ఈ తరుణంలో వివేకానంద రెడ్డి కుమార్తె హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ దర్యాప్తు వేగంగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. దీనిని విచారణకు స్వీకరించింది తెలంగాణ హైకోర్టు. ప్రధానంగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఈ కేసులో నిందితులను ప్రతివాదులుగా చేర్చి నోటీసులు ఇవ్వాలని కోరింది. సి.బి.ఐ తీరు చూస్తుంటే ఇప్పట్లో ఈ కేసు తేలేలా లేదని.. ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరుగుతోంది అంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. కానీ సిబిఐకి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే విచారణను వాయిదా వేసింది.
* అప్పట్లో సిబిఐ విచారణకు డిమాండ్
2019 మార్చి 15న వివేకానంద రెడ్డి( vivekanandha Reddy ) హత్యకు గురయ్యారు. అప్పట్లో టిడిపి అధికారంలో ఉంది. విపక్ష నేతగా ఉన్న జగన్ ఇది హత్య అని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో అప్పటి చంద్రబాబు సర్కార్ సిబిఐ దర్యాప్తును కోరింది. ఆ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య అంశం వైసిపి పై సానుభూతి చూసేలా చేసింది. వైసిపి అధికారంలోకి రాగలిగింది. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు నీరుగారింది. సిబిఐ దర్యాప్తు కావాలన్న జగన్.. తరువాత సిబిఐతో అవసరం లేదని.. సిఐడితో విచారణ చేపడతామని చెప్పుకొచ్చారు. అది మొదలు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.
* గత ఐదేళ్లలో మలుపులు
గత ఐదేళ్లలో వివేకానంద హత్య( Vivekanand Reddy mother) కేసుకు సంబంధించి విచారణలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన హత్య అని ఆయన కుమార్తె సునీత ఆరోపించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. సిబిఐ కూడా ఈ అభిప్రాయాన్ని వెల్లడించింది. కానీ గత ఐదేళ్ల వైసిపి పాలనలో కనీస స్థాయిలో కూడా ఈ కేసు ముందుకు సాగలేదు. చివరకు దర్యాప్తు అధికారులను సైతం అప్పటి అధికార పార్టీ నేతలు ప్రభావితం చేశారు. ప్రలోభం పెట్టారు. భయాందోళనకు గురి చేశారు. సునీత కేంద్ర పెద్దలను కలిసినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె ఫిర్యాదులతోపాటు న్యాయస్థానాలను ఆశ్రయించినా కేసు విచారణలో మాత్రం ఎటువంటి పురోగతి లేకుండా పోయింది.
* కూటమి అధికారంలోకి వచ్చినా..
కూటమి( allians ) ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వివేకానంద రెడ్డి హత్య కేసు ముందుకు సాగుతుందని సునీత భావించారు. సీఎం చంద్రబాబు తో పాటు హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను సైతం కలిశారు. కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే వైసీపీని ఇరుకున పెట్టవచ్చు అన్న కోణంలో కూటమి ప్రభుత్వం శరవేగంగా స్పందిస్తుంది అని భావించారు. కేంద్రంలో కూడా టిడిపి కీలక భాగస్వామి కావడంతో.. కేంద్ర పెద్దలు సైతం ఆదేశాలు ఇస్తారని అనుకున్నారు. కానీ ఇంతవరకు కదలిక లేకపోవడంతో తెలంగాణ హైకోర్టులో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని కోరారు. అయితే కోర్టు విచారణను వాయిదా వేసింది.