Kolikapudi Srinivasarao : తెలుగుదేశం పార్టీలో ( Telugu Desam Party) క్రమశిక్షణ కట్టు దాటుతోంది. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపుడి తరచూ వివాదాల్లో చిక్కుకొని.. హై కమాండ్ కు చికాకులు పెడుతున్నారు. అమరావతి ఉద్యమ నేతగా తెలుగుదేశం పార్టీతో ఆయన పని చేశారు. టిడిపిలో సభ్యత్వం లేకుండానే ఆయనకు మొన్న అసెంబ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఎమ్మెల్యేగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. పైగా సొంత పార్టీ శ్రేణులతో వివాదాలు పెట్టుకుంటున్నారు. వివాదాస్పద చర్యలతో ప్రభుత్వంతో పాటు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా.. మందలించినా ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో కొలిక పూడి విషయంలో సీరియస్ చర్యలు తీసుకోకుంటే తెలుగుదేశం పార్టీతో పాటు కూటమికి నష్టమని ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తప్పకుండా ఈ వ్యవహారాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని కూటమి గ్రహించింది. టిడిపి లైన్ దాటిన కొలికపూడిని ఇలానే వదిలేస్తే కూటమిపై కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసి అవకాశం ఉందని అనుమానిస్తోంది.
* వైసిపి పై అనుమానం..
ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై( MP Chinni ) కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే టికెట్ కోసం తన నుంచి ఐదు కోట్ల రూపాయలు చిన్ని తీసుకున్నారని ఆరోపించారు శ్రీనివాసరావు. దీనిని పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో కొలికపూడి వ్యవహారంలో మార్పు వచ్చిన విషయాన్ని గ్రహించింది హై కమాండ్. పైగా ఇటువంటి నేతల ద్వారా తెలుగుదేశం పార్టీతో పాటు కూటమిలో చిచ్చుపెట్టేందుకు వైసిపి తప్పకుండా ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఆదిలోనే దీనికి ఎండ్ కార్డు చెప్పాలని హై కమాండ్ భావిస్తోంది. కొలికపూడి సరెండర్ కావడమో.. లేకుంటే ఆయనను కూటమి బహిష్కరించడమో.. ఏదో ఒకటి చెయ్యాలని మాత్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* కూటమి సమన్వయ సమావేశం..
కృష్ణాజిల్లా( Krishna district) కూటమి సమన్వయ సమావేశం ఈరోజు జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లో టిడిపి హై కమాండ్ ప్రవేశించకుండా.. ఇలా సమన్వయ కమిటీ సమావేశం పేరుతో కొలికపూడికి గట్టి హెచ్చరికలే పంపినట్లు అర్థమవుతోంది. విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్ రాజా, వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ రాజగోపాల్, కాగితా కృష్ణ ప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్, బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను హాజరయ్యారు. అయితే ఈ సమావేశం అజెండా ప్రధాన కారణం కొలికపూడి అని తెలుస్తోంది. ఆయన క్రమేపి టిడిపికి దూరం కావడంతో పాటు కూటమికి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా కూటమి నేతల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.