CM Jagan: జగన్ అంటే చంద్రబాబుకు భయం. చంద్రబాబు అంటే జగన్ కు భయం. ఇది రాజకీయాల్లో సహజం. ఒకరినొకరు దెబ్బ తీసుకోవడం ఖాయం. వ్యూహంలో భాగంగానే అన్ని జరిగిపోతుంటాయి. సాధారణంగా జగన్ కు భయం ఉండదని వైసీపీ శ్రేణుల నమ్మకం. కానీ అదే నిజమైతే చంద్రబాబుతో బిజెపి పొత్తు పెట్టుకుంటే వద్దని జగన్ ఎందుకు చెబుతారు. చంద్రబాబు కలిసిన మరుక్షణం ఢిల్లీ వెళ్లి పెద్దలను ఎందుకు కలుస్తారు. ఒకవేళ బిజెపి టిడిపి తో కలిస్తే దాని పర్యవసానాలు జగన్ కు తెలుసు. అందుకే ఆ మూడు పార్టీలు కలవకూడదు అన్నది జగన్ లక్ష్యం. కానీ ఆ మూడు పార్టీలు పొత్తుతో దగ్గరవుతుండడంతో జగన్ అనేక రకాలుగా భయపడడం ప్రారంభించారు.
గత నాలుగున్నర సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు అమలు చేశారంటే కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే అసాధ్యం. కేంద్రం నేరుగా నిధులు ఇవ్వకున్నా.. వివిధ మార్గాల్లో రుణ సమీకరణకు మాత్రం జగన్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం సహకరించింది. ఆ సహకారంతోనే జగన్ సంక్షేమ పథకాలను అమలు చేయగలిగారు. ప్రజల మద్దతు కూడగట్టగలిగారు. అయితే ఈ నాలుగున్నర ఏళ్ళు ఒక వంతు. ఈ నెల రోజులు ఒక వంతు అన్నట్టు ఉంది పరిస్థితి. కొన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ టార్గెట్. మరికొన్ని సంక్షేమ పథకాలకు జీవోలు ఇచ్చి.. వాటిని ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మార్చుకోవాలి అన్నది కూడా ఒక వ్యూహం. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇన్ని రోజులు ఇచ్చినట్టే ఆర్థిక స్వేచ్ఛ ఇస్తే జగన్ అనుకున్నది సాధించగలరు. అయితే టిడిపి,జనసేనతో పొత్తు నేపథ్యంలో బిజెపి అందుకు అంగీకరిస్తుందా? లేదా? అని జగన్ భయపడుతున్నారు.
మరోవైపు పోల్ మేనేజ్మెంట్. గత ఎన్నికల్లో చంద్రబాబుపై ఉన్న కోపంతో జగన్ కు అంతులేని విధంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కేంద్ర సహకారం అందింది. ఎన్నికల పరంగా, వ్యవస్థాగతంగా అంతులేని మద్దతు దక్కింది. దీంతో జగన్ రెచ్చిపోయారు. చంద్రబాబుపై ఒత్తిడి పెంచగలిగారు. ఫలితంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్ సక్సెస్ కాగలిగారు. అధికారంలో ఉండి చంద్రబాబు ఫెయిలయ్యారు. ఇప్పుడు టిడిపి గూటిలోకి బిజెపి వస్తే నాటి సహకారం జగన్ కు అందదు. మిత్రపక్షంగా చంద్రబాబుకు సహకారం పుష్కలంగా లభిస్తుంది. అదే జరిగితే చంద్రబాబు పట్టు బిగిస్తారు. వ్యవస్థల్లో తన మనుషులను పెట్టుకుంటారు. తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుంటారు. ఇలా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను నిలిపివేస్తారు. ఎన్నికల నిర్వహణలో పూర్తిగా వ్యూహాల్లో మునిగి తేలుతారు. జగన్ భయపడుతున్నది ఇందుకే. అందుకే ఆ రెండు పార్టీలతో బిజెపి కలవకూడదని శతవిధాలా ప్రయత్నించారు. కానీ కుదరలేదు. జగన్ లో సైతం భయం పెరుగుతోంది. అందుకే ఆ మూడు పార్టీల వ్యూహాలకు అనుగుణంగా నడుచుకోవాలని భావిస్తున్నారు.