CM Jagan : సీఎం జగన్ చేతులెత్తేశారు. పార్టీ కేడర్ కంటే తనకు వలంటీర్లే గట్టెక్కిస్తారని గట్టి నమ్మకం ఏర్పరచుకున్నారు. తనపై అసంతృప్తితో వెళ్లిపోయినా పర్వాలేదు.. నా వలంటీర్ల సైన్యం ఉంటే చాలన్న డిసైడ్ కి వచ్చేశారు. వలంటీర్లకు వందనం పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వేదికపై ప్రసంగించిన జగన్ అదే పనిగా వలంటీర్లను పొగుడుతూ పార్టీ కేడర్ ను తక్కువ చేసేలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. తాను ప్రారంభంలో వలంటీర్లను లీడర్లు చేస్తానని చెప్పానని.. ఇప్పుడు మీ స్థితి లీడర్ల మాదిరిగా ఉందా? లేదా? అంటూ వలంటీర్లనే గుర్తు చేసుకునేలా మాట్లాడారు.
వాస్తవానికి వలంటీరు వ్యవస్థపై వైసీపీ కేడర్ లోనే తీరని అసంతృప్తి ఉంది. ప్రజలు ఏ పని కావాలన్నా వలంటీర్లనే కలుస్తున్నారని.. తమను అస్సలు పట్టించుకోవడం లేదని.. అటువంటప్పుడు తాము ప్రజాప్రతినిధులుగా ఉండి ఏం లాభమని సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకూ ఒకటే వ్యధ. ఆ మధ్యన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణకుగాను వర్క్ షాపు నిర్వహించారు. నేను బటన్ నొక్కుతా.. మీరు ప్రజల వద్దకు వెళ్ళి చెప్పాలన్నప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ చేతులమీద పనులు కానప్పుడు ప్రజలు తమను నిలదీస్తున్నారని చెప్పడంతో అప్పటికప్పుడు గడపగడపకు నిధులు అంటూ ఎమ్మెల్యేలకు ఫండ్ కేటాయించాల్సి వచ్చింది.
వలంటీర్ల వ్యవస్థతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్న అపవాదు జగన్ సర్కారుపై ఉంది. జగన్ రాజకీయం కోసం తమ హక్కులను సైతం కాలరాశారంటూ స్థానిక సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు చెప్పులతో కొట్టుకున్న సందర్భాలున్నాయి. మంత్రులు గ్రామాల్లో పర్యటించినప్పుడు మీకు పథకాలు ఇస్తున్నది ఎవరో తెలుసా అని అడిగేటప్పుడు ప్రజలు చటుక్కున వలంటీర్ల పేరే చెబుతున్నారు. దీంతో ఖంగుతినడం వైసీపీ లీడర్ల వంతవుతుంది. ఇప్పుడు జగన్ చెబుతున్న లీడర్ల మాట అదేనన్న మాట. నాడు వలంటీర్లను లీడర్లను చేస్తానని చెప్పింది ఇందుకోసమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వలంటీర్లు కేవలం ప్రభుత్వ వారధులే కాదు. ఇకపై పార్టీకి సేవలందిస్తారని అర్ధం వచ్చేలా సీఎం జగన్ వ్యాఖ్యానించడం విశేషం. మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని హామీ ఇచ్చారు. వలంటీర్ల నిర్వాకాల వల్లనే ఎక్కవ మంది ఓటర్లు వైసీపీకి దూరం అవుతున్నారన్న ప్రచారం ఉంది. అయినప్పటికీ వలంటీర్లనే నమ్ముకోవడం .. పార్టీ క్యాడర్ ను విస్మరించడం తన నెత్తి మీద తాను చేయి పెట్టుకున్నట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.