CM Jagan: జయహో బీసీ గర్జనతో దూకుడు మీద ఉన్న జగన్ సర్కారు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో బీసీలను ఆకర్షించిన జగన్ వారి మద్దతుతోనే అద్భుత విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి వారినే చేరదీసి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అది గతంలో లాగా వర్కవుట్ అవుతుందా? అన్నది అనుమానమే. ప్రస్తుతం అన్ని పార్టీలు బీసీ జపాన్ని పఠిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం తరువాత బీసీలు ఆ పార్టీ వెంట నడిచారు. కానీ గత ఎన్నికల్లో జగన్ చాలారకాలుగా హామీలివ్వడంతో ఒక చాన్స్ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే జగన్ సర్కారు 55 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది. చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు సభ్యులను నియమించింది. దీంతో తమ కులాలకు ప్రాతినిధ్యం దక్కిందని బీసీలు సంబరపడిపోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తథ్యమని భావించారు. కానీ వారి ఆశలను నవరత్నాలతో జగన్ కొల్లగొట్టారు. నవరత్నాల ద్వారా ఇచ్చిన సంక్షేమ పథకాలు లెక్కన కట్టి అదే బీసీ సంక్షేమంగా చెప్పుకొచ్చారు.

గత ఎన్నికల్లో పనికొచ్చారని.. ఈ ఎన్నికల్లో పనికొస్తారని ఆయా సామాజికవర్గాల్లోని వైసీపీ నేతలకు పదవులిచ్చిన ప్రభుత్వం భారీగా వేతనాలు, ఇతరత్రా రాయితీలు చెల్లిస్తూ వచ్చింది. అయితే రాజకీయ నిరుద్యోగులకు కొలువుగా మారిన బీసీ కార్పొరేషన్లు కులాలకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈ కార్పొరేషన్లకు విధులు, నిధులు లేకపోవడంతో నామినేట్ అయిన వారు సైతం పెదవివిరిచారు. కులానికి ఏం చేయలేకపోయామన్న బాధ వారిని వెంటాడింది. అయినా చేతిలో ఏదో ఒక పదవి ఉంటేనే కదా విలువ. పైగా వేలల్లో వేతనం లభిస్తుండడంతో ఎలాగోలా నెట్టుకుంటూ వచ్చారు. అయితే వీరి పదవీ కాలం డిసెంబరుతో ముగిసింది. దీంతో జగన్ అంతా కొత్తవారిని తీసుకుంటారని భావించారు. కానీ పాత వారినే కొనసాగిస్తూ జీవోలిచ్చారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ పాత పాలకవర్గాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అయితే వైసీపీలో చాలామంది నాయకులు తమకు మలి విడతలో చాన్స్ దక్కుతుందని భావించారు. కానీ అటువంటి వారికి అవకాశం లేకుండా జగన్ పాత పాలకవర్గాలనే కొనసాగించారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఎటువంటి సాహసం చేయలేనని సంకేతాలిచ్చారు. అయితే చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు పదవిలో కొనసాగేందుకు నిరాసక్తత కనబరుస్తున్నారు. చేతిలో పదవి ఉన్నా ఏ మాత్రం ప్రయోజనం పొందలేకపోతున్నామన్న బాధ వారిలో ఉంది. పైగా ఎక్కడికక్కడే లోకల్ ఎమ్మెల్యేల డామినేషన్ కొనసాగుతుంది. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి ఉన్నా తేలిగ్గా తీసుకుంటున్నారు. కనీసం సర్పంచ్ లు, ఎంపీటీసీలకు ఉండే గౌరవం కూడా లేదు. చైర్మన్ వరకూ పర్వాలేకున్నా.. వైస్ చైర్మన్, సభ్యుల విషయానికి వచ్చేసరికి మరీ చులకన భావంతో చూస్తున్నారు. పైగా వీరికి ఎటువంటి వేతనాలు లేవు. దీంతో కొనసాగింపు లభించినా వారిలో మాత్రం ఆ సంతోషం కనిపించడం లేదు.