CM Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ పూర్తయింది. ఇంతకీ ఆయన లక్ష్యం నెరవేరిందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. జగన్ ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా ముందస్తు షెడ్యూల్ ఖరారు అయ్యేది. వాస్తవానికి ఈనెల 11న జగన్ ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ రెండు రోజులు ముందుగానే ఆయన ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను మాత్రమే కలిసి తిరుగు ముఖం పట్టారు. ప్రధానంగా బిజెపి రాజకీయ వ్యవహారాలను చూస్తే మంత్రి అమిత్ షాను కలవలేకపోవడం గమనార్హం. చంద్రబాబు వెళ్లి వచ్చిన తరువాత జగన్ ఢిల్లీ వెళ్లడం.. కేవలం ప్రధానితో సమావేశానికి పరిమితం కావడం.. అది కూడా పది నిమిషాలు పాటే మాట్లాడడం రకరకాల ఊహాగానాలకు కారణమవుతోంది.
టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపి రాకుండా అడ్డుకట్ట వేయడానికి జగన్ ఢిల్లీ టూర్ చేశారని అనుమానాలు ఉన్నాయి. జాతీయ మీడియా వర్గాలు సైతం ఇదే అనుమానంతో ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. అయితే జగన్ ప్రధానితో ఏం మాట్లాడారు? ఏం ప్రతిపాదనలు చేశారు? రాజకీయ అంశాలు మాట్లాడారా? రాష్ట్ర విభజన హామీలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారా? అన్నది మాత్రం తెలియడం లేదు. కానీ ఆయన ఎన్డీఏలో చేరికపై ప్రధాని వద్ద సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాను నమ్మదగిన మిత్రుడిగా భావిస్తే వెంటనే ఎన్డీఏలో చేరిపోతానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ప్రధాని పెద్దగా స్పందించనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మోదీ పార్లమెంటులో బిజీగా ఉన్నారు. అందుకే జగన్ తో పది నిమిషాలు పాటు మాత్రమే మాట్లాడారు. కానీ గంటన్నర చర్చలు జరిపినట్టు వైసిపి సోషల్ మీడియా చెబుతోంది. కానీ సీఎం గంట వెయిట్ చేసిన తర్వాత.. ప్రధాని మోదీని కలిసేందుకు అవకాశం ఇచ్చారు. అది కూడా కేవలం 10 నిమిషాల పాటు పొడిపొడిగా ప్రధాని మాట్లాడి ముగించినట్లు సమాచారం.
వాస్తవానికి బిజెపిలో ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నా అమిత్ షా ప్రమేయం తప్పనిసరి. ఒకవేళ జగన్ ప్రతిపాదనపై మోదీ సానుకూలంగా ఉంటే.. వెంటనే అమిత్ షా రంగంలోకి దిగేవారు. జగన్ తో చర్చలు జరిపేవారు. కానీ నిన్న ఢిల్లీలో అటువంటి పరిస్థితి లేదు. కనీసం జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా లభించలేదు. దీంతో వైసిపి వర్గాలే ఆశ్చర్యపడుతున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ బలం 12 ఎంపీ స్థానాలు. కనీసం వాటిని పరిగణలోకి తీసుకొని తమకు ప్రాధాన్యం ఇస్తారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే నిన్న వారు ఆశించిన స్థాయిలో కేంద్ర పెద్దల నుంచి స్పందన రాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. వాస్తవానికి ఏపీలో పరిస్థితులపై కేంద్ర పేదలకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పరస్పరం సహకరించుకున్నామని.. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని అగ్రనేతలు చెబుతున్నట్టు సమాచారం. 2024 ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుతో పాటు ఏపీలో సైతం బలం పెంచుకునే దిశగా బిజెపి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏపీ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికైతే జగన్ ఢిల్లీ టూర్ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని తెలుస్తోంది.