YS Sharmila: షర్మిల సక్సెస్ అయ్యారు. అసలు ఉనికి లేని కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలను అరెస్టు చేసేదాకా పరిస్థితి తీసుకొచ్చారు. పీసీసీ పగ్గాలు అందుకున్న తర్వాత షర్మిల దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. నేరుగా జగన్ సర్కారుపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆమె.. ప్రజా పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అందులో భాగంగా మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసనకు వచ్చారు.చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. కానీ పోలీసులు అడ్డగించారు. షర్మిలను అదుపులోకి తీసుకున్నారు.
జగన్ తో రాజకీయంగా విభేదించిన షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అందుకొని సోదరుడిపైనే ఆమె కత్తులు దూస్తున్నారు. ఏపీలో వైసిపి పతనంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ఆరోపణలు చేస్తే సరికాదని.. క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా డీఎస్సీ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ పోరాట బాట పట్టారు. కొద్దిరోజుల కిందట జగన్ సర్కార్ 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ విపక్షంలో ఉన్నప్పుడు 7100 పోస్టులకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేస్తే ఇదే జగన్ ఎద్దేవా చేశారు. అవి ఒక పోస్టులేనా అని నిలదీశారు. తాను అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తానని.. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ చేపడతానని జగన్ హామీ ఇచ్చారు. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్క సారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించలేదు. దీనిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో షర్మిల డీఎస్సీ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ పోరాట బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆమె పిలుపుమేరకు విజయవాడకు చేరుకున్నారు. భారీ నిరసన ర్యాలీతో సచివాలయానికి బయలుదేరిన షర్మిల కు పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. ఎక్కడికక్కడే అడ్డగించారు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన షర్మిల రోడ్డుపై బైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అతి కష్టం మీద షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలుపుతామంటే జగన్ సర్కార్ దారుణంగా వ్యవహరిస్తుందని షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.