CM convoy : ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) కాన్వాయ్ విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఎక్కువ సేపు నిలిపివేయకుండా పోలీస్ అధికారులు కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ నిలిపివేత సమయాన్ని వీలైనంతవరకు తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా వీఐపీ మూవ్ మెంట్ మోనిటరింగ్ సిస్టం అనే వ్యవస్థను తీసుకొచ్చారు. ట్రయల్ రన్ కూడా చేస్తున్నారు. ఆది నుంచి తన కాన్వాయ్ విషయంలో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేస్తూ వచ్చారు. తన కాన్వాయ్ తో పాటు జిల్లాల పర్యటన సమయంలో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని.. ఎక్కువసేపు ట్రాఫిక్ నిలిపి వేయవద్దని అధికారులకు సూచించారు. గత అనుభవాల దృష్ట్యా.. తన పర్యటనల వేళ.. భద్రతతో పాటు ట్రాఫిక్ విషయాల్లో ఎప్పటికప్పుడు కీలక సూచనలు చేస్తూ వచ్చారు చంద్రబాబు. అందుకే పోలీసు యంత్రాంగం తాజాగా ఇప్పుడు సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది.
* ముందుగానే సంకేతాలు..
ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో(Undavalli) చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు ఆయన ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ తో పాటు విమానాశ్రయం వరకు వెళుతుంటారు. పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో రెండు వైపులా 36 స్పెషల్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు ఏఐ ఆధారంగా పనిచేసేలా సెట్ చేశారు. వీటిని విజయవాడలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ తో లింక్ చేశారు. అమరావతి ప్రాంతంలో ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల దగ్గర తొలి కెమెరా ఏర్పాటు చేయగా.. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పనిచేస్తుంది. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు వెళ్లే వాహనం అక్కడికి రాగానే జిపిఎస్ ఆధారంగా ఆ కెమెరా పసిగడుతుంది. అక్కడ వీడియోలను విజయవాడలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుస్తుంది. మొదటి కెమెరా నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి ఆ తర్వాత ఉండే మూడు పాయింట్లను అలర్ట్ చేస్తుంది. తద్వారా ట్రాఫిక్ ఆపిన సమయాన్ని లెక్కించవచ్చు. విజయవాడ నగర పరిసరాలకు కాన్వాయ్ చేరే సమయాన్ని అంచనా వేయవచ్చు.
Also Read : తల్లికి వందనం రెడీ.. చంద్రబాబు కామెంట్స్!
* ఇంటర్నెట్ ఆధారిత కెమెరాల ఏర్పాటు..
అయితే గుంటూరులో ఉండవల్లి చంద్రబాబు నివాసం నుంచి వచ్చేటప్పుడు.. సచివాలయానికి వెళ్లేటప్పుడు.. విజయవాడ మీదుగా గన్నవరం వచ్చేటప్పుడు.. ఇలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్( internet of things) ఆధారంగా పనిచేసే కెమెరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాయి. దానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు కాన్వాయ్ వచ్చేటప్పుడు ట్రాఫిక్ ను నియంత్రిస్తారు. అప్పటికప్పుడు చేయడం ద్వారా సమయం ఆదా అవుతుంది. సామాన్య జనాలకు కూడా ఇబ్బంది ఉండదు. అటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలి కూడలిగా కేసరపల్లి జంక్షన్ ఉంటుంది. అక్కడ కూడా ఒక కెమెరాను ఏర్పాటు చేశారు. అటువైపుగా ట్రాఫిక్ ను అంచనా వేసి అది అప్రమత్తం చేస్తుంది. అయితే ఈ ప్రత్యేక వ్యవస్థను గత రెండు నెలలుగా పోలీసులు పరీక్షిస్తున్నారు. ఈ వ్యవస్థ పని చేసేందుకు ప్రత్యేకంగా ఏఐ ప్రోగ్రామ్ను తయారు చేయించారు పోలీసులు. ప్రతిరోజు సీఎం చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించే రూట్లో ముందు పది నిమిషాల మేరకు ట్రాఫిక్ నిలిపివేత సమయం నమోదు అయ్యేది. ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థ సాయంతో ఆ పది నిమిషాల సమయం ఐదు నిమిషాలే ఉంటుంది. ఈ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించిన తర్వాత అధికారికంగా ప్రారంభించాలని పోలీసులు భావిస్తున్నారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిలిపివేసే సమయం తగ్గించాలన్నది దీని ప్రణాళిక.
* రద్దీ పెరిగిన నేపథ్యంలో..
ప్రస్తుతం విజయవాడలో వాహన రద్దీ పెరుగుతోంది. అమరావతి రాజధాని( Amaravathi capital ) పునర్నిర్మాణ పనులు ప్రారంభం అయిన నేపథ్యంలో.. సచివాలయానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రముఖుల తాకిడి సైతం పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగింది. అందులో భాగంగానే పోలీసులు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానంతోనైనా విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగుతాయో.. లేదో చూడాలి.