CM Chandrababu: సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దయింది. శుక్రవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ప్రతిష్టాత్మకమైన ఉచిత గ్యాస్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురం గ్రామంలో గ్యాస్ పంపిణీ చేపట్టారు.శాంతమ్మ అనే మహిళ ఇంట్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ను అందజేశారు. స్వయంగా టీ కాచి ఆ కుటుంబ సభ్యులతో పాటు తాగారు. మరో మహిళ ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ మొత్తాన్ని అందజేశారు. గ్రామస్తులతో మమేకమయ్యారు. ప్రభుత్వ పనితీరుతో పాటు సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. సాయంత్రం శ్రీకాకుళం నగరంలో అధికారులతో సమీక్షలు జరిపారు. రాత్రి అక్కడే శ్రీకాకుళం నగరంలో బస చేశారు. శనివారం విజయనగరం జిల్లాలో రోడ్ల అభివృద్ధి పథకానికి శ్రీకారం చుడతానని భావించారు. ముందుగానే విజయనగరంలో సీఎం పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు అయింది. అయితే ఉన్నట్టుండి సీఎం పర్యటన రద్దు అయ్యింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ఉన్నపలంగా తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి.. నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. అందుకే సీఎం చంద్రబాబు పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.
* రఘురాజు పై అనర్హత వేటుతో
విజయనగరం స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు ఉండేవారు. ఎన్నికలకు ముందు ఆయన భార్య, శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన వైసిపి స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాత్రం స్తబ్దతగా ఉండిపోయారు. కానీ రఘురాజు ప్రోత్సాహంతోనే వారంతా వైసీపీని వీడినట్లు హైకమాండ్ భావించింది. అందుకే శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజుకు ఫిర్యాదు చేసింది వైసిపి. ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటు వేయించింది. అప్పటినుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీగా ఉంది. దానికి నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల కమిషన్. అయితే ముందస్తుగా సీఎం పర్యటన ఖరారు అయినా.. నిబంధనల ప్రకారం రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
* 4న నోటిఫికేషన్
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 4న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 11 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న పరిశీలన ఉంటుంది. నవంబర్ 14 వరకు నామినేషన్లను సంహరించేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 28న ఉప ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటు వినియోగించుకోవచ్చు. డిసెంబర్ 1న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.