CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. శాసనమండలికి మాత్రం వైసిపి సభ్యులు వస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే శాసనసభలో కూటమి ఎమ్మెల్యేలే విపక్షపాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు అతిగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. అనవసర వ్యాఖ్యలు, ప్రశ్నలు వేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రుల వద్ద ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
* వ్యక్తిగత విమర్శలు వద్దు..
శాసనసభలో ఎమ్మెల్యే బాలకృష్ణ ( MLA Balakrishna)వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసాయి. బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వైసీపీ హయాంలో సినీ పరిశ్రమకు చాలా అవమానాలు జరిగాయని చెప్పే ప్రయత్నం చేశారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి గట్టిగా అడిగితేనే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే అప్పట్లో జరిగిన పరిణామాలను వివరించే క్రమంలో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ విషయంలో తేలిగ్గా తీసుకున్నారన్న కామెంట్స్ ఎదురవుతున్నాయి. అయితే ఈ వివాదం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది. మెగా, నందమూరి కుటుంబాల మధ్య.. టిడిపి, జనసేనల మధ్య.. కమ్మ, కాపు కులాల మధ్య.. కూటమి ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య అగాధం ఏర్పడాలి. ఆ ప్రయత్నమే చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. అసహనం వ్యక్తం చేశారు.
* ఎమ్మెల్యేలపై ఆగ్రహం..
మరోవైపు ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి( Sudhir Reddy), కూన రవికుమార్ ల తీరుపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రులపై వారు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించినట్లు సమాచారం. శాఖపరమైన ప్రశ్నలు వేసినప్పుడు కొంత సమయమనం పాటించాలని.. సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అలా చేయడం ఏమిటని.. స్వేచ్ఛ ఇస్తే ఇలా వ్యవహరించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇలా శాసనసభలో వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇంత జరుగుతుంటే పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్, పార్టీ విప్ లు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇది రిపీట్ అయితే మాత్రం చర్యలు తప్పవని కాస్త కటువుగానే చంద్రబాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.