Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu : చంద్రబాబు పి4కి రూ.10 కోట్లు.. ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే

CM Chandrababu : చంద్రబాబు పి4కి రూ.10 కోట్లు.. ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే

CM Chandrababu : పేదల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు( CM Chandrababu) తలపెట్టిన పీ4 కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు పేదరికం నిర్మూలనకు ఆర్థికంగా స్థితిమంతులు భాగస్వామ్యులు అవుతున్నారు. కీలక ప్రాజెక్టులు చేపట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా సొంత నిధులతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించి ఇచ్చేందుకు గుంటూరు జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ముందుకు వచ్చారు. సీఎం చంద్రబాబు పిలుపుతో తన మంచి మనసు చాటుకున్నారు పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు వితరణగా అందించేందుకు ముందుకు వచ్చారు.

Also Read : సచివాలయ ఉద్యోగుల సేవలు అలా.. కూటమి సంచలన నిర్ణయం!

* సాగునీటి ఇబ్బందులు..
గుంటూరు జిల్లా కాకమాను మండలంలో రైతులు సాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొమ్మమూరు కెనాల్( kommamuru canal) ద్వారా నీటి సౌకర్యం ఉన్నా.. శివారు భూములకు సాగునీరు అందడం లేదు. అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తే ఆ ప్రాంత రైతుల కష్టాలు తీరుతాయి. ఇటీవల పేదరికంపై పోరాటం చేసేందుకు సీఎం చంద్రబాబు పి4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు అందుకొని ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్( Karu Manchi Prasad ) ముందుకు వచ్చారు. రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని తెలుసుకొని చలించిపోయారు. నేరుగా సీఎం చంద్రబాబును కలిశారు. కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు వితరణంగా అందజేస్తానని చెప్పారు. దీంతో సాగునీటి సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరకనుంది.

* ఎత్తిపోతల పథకం నిర్మిస్తే..
కొమ్మమూరు కాలువ 43 కిలోమీటర్ల పొడవు ఉంది. కానీ చివరి 10 కిలోమీటర్ల మేర భూములకు చాలా రోజులుగా సాగునీరు అందడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి కాకమాను దగ్గర కొమ్మమూరు కాలువపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాల్సి ఉంది. దీని నిర్మాణం పూర్తయితే కాకమాను, బి.కె పాలెం, అప్పాపురం, గరికపాడు, కొండపాతూరు గ్రామాల్లోని 5 వేల ఎకరాలకు పైగా భూమికి సాగునీరు పుష్కలంగా అందనుంది. వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కారుమంచి ప్రసాద్ ముందుకు వచ్చారు. ప్రభుత్వం కూడా అవసరమైన నిధులు వెచ్చించి పనులు పూర్తి చేయనుంది.

* విత్తన వ్యాపారిగా సుపరిచితం..
గుంటూరు జిల్లా( Guntur district) ప్రత్తిపాడు నియోజకవర్గం లో కాకమాను గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన కారుమంచి ప్రసాద్ నాలుగు దశాబ్దాలుగా విత్తన వ్యాపారంలో ఉన్నారు. 1995 నుంచి ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. పెద్ద నందిపాడు లిఫ్ట్ స్కీం పూర్తి చేయడానికి 1995లో ఆయన ఆర్థిక సాయం అందించారు. కాగా కారుమంచి ప్రసాద్ సూచించిన విధంగా కొమ్మమూరు ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు డిపిఆర్ సిద్ధం చేసి త్వరగా అనుమతులు ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సొంత గ్రామంలో రైతులకు మేలు చేసేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన కారుమంచి ప్రసాద్ ను అభినందించారు సీఎం చంద్రబాబు.పి 4 కార్యక్రమానికి స్పందించి ముందుకు వస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : రాయలసీమకు జగన్.. పోలీస్ అనుమతి పై అనుమానం!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular