CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఎన్ని కష్టాలు ఉన్నా జీతాల చెల్లింపులో మాత్రం జాప్యం జరగకూడదని హెచ్చరించారు. కచ్చితంగా ప్రతినెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని.. ఏమాత్రం ఆలస్యమైనా తాను ఊరుకోనని కూడా హెచ్చరించారు సీఎం చంద్రబాబు. సకాలంలో జీతాలు చెల్లిస్తేనే ఉద్యోగులు అంకితభావంతో పని చేస్తారని చెప్పుకొచ్చారు. గత కొద్ది నెలలుగా జీతాలు చెల్లింపులు ఆలస్యం అవుతుండడం పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై సైతం దృష్టి పెట్టామని.. వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అన్ని విభాగాలు, శాఖలతో సమీక్షలు జరిపిన చంద్రబాబు ఉద్యోగుల విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
* ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) ప్రభుత్వం వల్లనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం వల్ల ఏర్పడిన నష్టాలు వెంటాడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే.. రూ. 22,507 కోట్ల పాత బకాయిలను చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఎన్నో సవాళ్లు ఇబ్బందులు ఎదురయ్యాయని.. అయినా సరే క్రమశిక్షణతో పాత బకాయిలను కూడా తీర్చగలిగేలా ఆర్థిక శాఖ పని చేసిన విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. పింఛన్ లబ్ధిదారులతోపాటు ఉద్యోగులకు చెల్లింపులు చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు.
* త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
త్వరలో మెగా డీఎస్సీ ని( Mega DSC) పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. గత జూన్ లో మెగా డీఎస్సీ ప్రకటించినా..ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో వాయిదా పడింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరువేల ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి డీఎస్సీ ప్రకటించింది. అయితే వాటిని పూర్తి చేయడంలో మాత్రం ఫెయిల్ అయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ 6000 పోస్టులకు అదనంగా మరో పదివేల పోస్టులను జతచేస్తూ.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు సంబంధించి తొలి ఫైల్ పై సంతకం చేశారు. అయితే మధ్యలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అడ్డంకిగా మారింది. వీలైనంత వేగంగా ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
* ప్రారంభంలో ఒకటో తేదీన..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో.. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు( salaries) చెల్లించింది. అయితే గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో జీతాల చెల్లింపు ఆలస్యం అవుతోంది. ఒకటో తేదీన పడాల్సిన జీతాలు ఐదో తేదీ దాటుతున్నాయి. దీనిపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఉద్యోగుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకుంటుంది. దీనిని గుర్తించిన సీఎం చంద్రబాబు ఉద్యోగుల విషయంలో ప్రత్యేక ప్రకటన చేశారు. మరి అది ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి.