CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు సమీపిస్తోంది. 2024 జూన్ లో వచ్చిన ఫలితాల్లో కూటమి ఏకపక్ష విజయం సాధించింది. 164 స్థానాల్లో గెలుపొందింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలంతా ఓడిపోయారు. అయితే మరోసారి అదే పట్టును కొనసాగించాలని చూస్తోంది కూటమి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఓడిపోయిన నియోజకవర్గాలపై ఇప్పుడు దృష్టి పెట్టింది. మరోసారి అక్కడ కూటమి గెలిచేలా గట్టి ప్రణాళికలు వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో చాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది. అందుకే వైసీపీ కీలక నేతల నియోజకవర్గాల విషయంలో గట్టి పట్టుదలతోనే ఉంది. తాజాగా జరిగిన కలెక్టర్ల రివ్యూలో ఆ జిల్లా మంత్రులకు సైతం సీఎం చంద్రబాబు నిర్దేశించినట్లు తెలుస్తోంది. అభివృద్ధిని చేయడం ద్వారా వైసీపీ కీలక నేతలకు చాన్స్ లేకుండా చూడాలన్నది చంద్రబాబు ఆలోచనగా సమాచారం.
* మరోసారి గెలవకుండా..
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ కీలక నేతలుగా చాలామంది ఉన్నారు. అటువంటివారు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. మరోసారి వారు గెలవకుండా ఉండాలని చూస్తున్నారు చంద్రబాబు. అందులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా వంటి వారు మరోసారి అసెంబ్లీకి రాకుండా చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. వారి విషయంలో జిల్లా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు కీలక టాస్కులు ఇచ్చారు. అభివృద్ధి పరంగా చేపట్టాల్సిన అంశాల గురించి ఆయా జిల్లా కలెక్టర్లతో చర్చించారు సీఎం చంద్రబాబు.
* సీనియర్లు ఓటమి..
2024 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి జగన్ క్యాబినెట్లో ఉన్న వారంతా ఓడిపోయారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే గెలిచారు. అయితే ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఓడించాలని చూస్తున్నారు చంద్రబాబు. ఎంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 40 శాతం ఓటు బ్యాంకు గురించి ఆలోచన చేస్తోంది తప్ప.. ప్రధాన నియోజకవర్గాల్లో పట్టు తప్పుతోందని గ్రహించడం లేదు. అయితే ఈసారి జగన్ మోహన్ రెడ్డి సైతం సీనియర్లను బరిలో దించే అవకాశం ఉంది. అయితే అటువంటి నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్న చంద్రబాబు ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేస్తున్నారు. అధికార యంత్రాంగం పరంగా కూడా అక్కడ ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తున్నారు. తద్వారా ఆ నియోజకవర్గాలను తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. తాజాగా కలెక్టర్ల సదస్సులో దీనిపైనే కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వారు మరోసారి గెలవకూడదు అన్నది చంద్రబాబు ప్రణాళికగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.