CM Chandrababu: ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే మహిళలే కీలకం. మహిళా ఓటు బ్యాంకు దక్కితేనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది. 1995లో తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో సంక్షోభం తర్వాత.. చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. సీఎం అయ్యారు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారు అంటే మహిళలే కారణం. 1995లో బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు డ్వాక్రా సంఘాలతో పాటు మహిళలకు సంబంధించిన పథకాలను అమలు చేసి చూపించారు. దీంతో 1999 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించారు మహిళలు. అయితే మారిన పరిణామాల క్రమంలో 2004, 2009లో దూరమయ్యారు. 2014లో చంద్రబాబు వైపు వచ్చినట్టే వచ్చి.. 2019లో జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు. 2024 లో మాత్రం సూపర్ సిక్స్ పథకాలను నమ్మి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. టిడిపి కూటమి విజయం సాధించేందుకు దోహదపడ్డారు.
* మహిళల ఓట్లతో బలంగా వైసిపి..
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కానీ 40 శాతం ఓట్లను సాధించుకుంది. అయితే ఓట్లలో మహిళల ఓట్లే అధికమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ పార్టీకి 26 శాతం మంది మహిళా ఓటర్లు ఓటు వేసినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఈ నమ్మకంతోనే తాము మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. మహిళల మద్దతుతోనే మరోసారి ఈ రాష్ట్రానికి సీఎం అవుతానని ధీమాతో ఉన్నారు.
* సూపర్ సిక్స్ పథకాల అమలు..
అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు( CM Chandrababu) మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. వారిని తన వైపు పూర్తిస్థాయిలో టర్న్ చేసేలా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి చూపిస్తున్నారు. ప్రతి వంద మందిలో 13 మంది పింఛన్ అందుకుంటున్నారు. అయితే పెన్షన్ లబ్ధిదారుల్లో అధికంగా మహిళలే ఉన్నారు. ఏకంగా 60 శాతం వరకు మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారు. పెంచిన పింఛన్ మొత్తంతో మహిళల్లో చంద్రబాబు పట్ల సానుకూలత కనిపిస్తోంది. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేశారు. మొన్నటికి మొన్న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించారు. రోజుకు లక్షలాదిమంది మహిళా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో. వారు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో వైపు తల్లికి వందనం అమలు చేసి చూపించారు. ఇలా మహిళలని టార్గెట్ చేసుకుంటూ పథకాలను అమలు చేసి వారి నుంచి సానుకూలత పొందుతున్నారు.
* మరో రెండు పథకాలు..
తాజాగా తన అమ్ముల పొదిలో ఉన్న మరో రెండు పథకాలను బయటకు తీశారు చంద్రబాబు. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి( NTR Kalyana Lakshmi), ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాలను ప్రారంభించనున్నారు. సాధారణంగా పిల్లల చదువుల కోసం ఎక్కువమంది అప్పులు చేస్తారు. అటువంటి వారి కోసం లక్ష రూపాయల గరిష్ట పరిమితితో బ్యాంకుల ద్వారా రుణం అందజేయనున్నారు. మరోవైపు పేద ఇంట్లో వివాహాలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అటువంటి వారికి చేయూతనిచ్చేందుకు గరిష్టంగా లక్ష రూపాయల వరకు రుణం అందజేయనున్నారు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా. అయితే ఈ రుణాలను పావలా వడ్డీకే అందించనున్నారు. అయితే ఈ రెండు పథకాలు మహిళల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు డ్వాక్రా సంఘాల సభ్యులు ఇలా దరఖాస్తు చేసుకోగానే రుణం మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రుణాన్ని సులభ వాయిదా పద్ధతుల్లో తిరిగి చెల్లించుకునే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. ఈ రెండు పథకాలు టిడిపి కూటమి వైపు మహిళలు టర్న్ అయ్యేలా చేస్తాయని భావిస్తున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.