Special Trains: ఏపీలో( Andhra Pradesh) దసరా, దీపావళి పండుగల దృష్ట్యా.. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనుంది రైల్వే శాఖ. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే తో పాటు పలు రైల్వే డివిజన్లు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా తిరుపతికి అనుసంధానిస్తూ ఉత్తర, దక్షిణ భారతదేశం నుంచి రైళ్లు నడవనున్నాయి.
* ప్రతి ఆదివారం తిరుపతి- సాయి నగర్ షిరిడి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. వేకువజామున నాలుగు గంటలకు ఈ రైలు తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు శిరిడీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు సోమవారం రాత్రి 7:35కు షిరిడీలో బయలుదేరుతుంది. బుధవారం మధ్యాహ్నం 1:30 తిరుపతికి చేరుకుంటుంది.ఏపీలోని రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
* ప్రతి మంగళవారం తిరుపతి- జల్నా మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. మధ్యాహ్నం 3:15 గంటలకు తిరుపతిలో ఈ రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 3:50 గంటలకు జల్న కు చేరుకుంటుంది. సోమవారం ఉదయం 7 గంటలకు జల్నలో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు తిరుపతిలో బయలుదేరి.. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
* 470 ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే( South Central Railway) పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దసరా తిరుగు ప్రయాణాలు, దీపావళి వేళ ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈసారి మొత్తం 470 ప్రత్యేక రైలు నడుస్తాయని అధికారులు చెబుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 170 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే మీదుగా 115 రైళ్లు నడుస్తాయి. 185 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధి గుండా రాకపోకలు సాగిస్తాయి. మొత్తానికైతే పండుగల రవాణా కష్టాలు ప్రజలు అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది రైల్వే శాఖ.