Nagababu : మెగా బ్రదర్ నాగబాబు కు గుడ్ న్యూస్. ఆయనను ఏపీ క్యాబినెట్ లోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. 24 మంది మంత్రులతో ఏపీ ప్రభుత్వం కొలువుదీరింది. మరో మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. దీనిపై రకరకాల ప్రచారం నడిపించింది. పిఠాపురం వర్మ కోసం అంటూ ఒకసారి.. వంగవీటి రాధాకృష్ణ కోసం అని మరోసారి.. కాదు కాదు రఘురామకృష్ణంరాజు కోసమని ఇంకోసారి.. ఇలా చాలా రకాల ప్రచారాలు నడిచాయి. అన్నింటికీ తెరదించుతూ మెగా బ్రదర్ నాగబాబు కోసమేనని తాజాగా తేలింది. ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. బిజెపికి ఒక మంత్రి పదవితో సరిపెట్టారు. ఇప్పుడు జనసేనకు మరో మంత్రి పదవి ఇవ్వనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక పవన్ పాత్ర కూడా ఉంది. ఈ తరుణంలోనే ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. కీలకమైన ఆరు శాఖలను పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. అదే పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. మరో ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ శాఖ దక్కింది. ఇప్పుడు నాగబాబు మంత్రివర్గంలోకి రానుండడంతో ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారు తెలియాల్సి ఉంది.
* పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు
జనసేనలో చాలా యాక్టివ్ గా పని చేశారు నాగబాబు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచినా రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. గత ఐదేళ్లుగా జనసేన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. సన్నాహాలు కూడా పూర్తి చేశారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించడంతో.. తన ఆలోచనను విరమించుకున్నారు. ఈ ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం కృషి చేశారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ జనసేన తరఫున విస్తృత ప్రచారం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల్లో చెమటోడ్చి పనిచేశారు.
* చివరకు ఇలా
ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో నాగబాబుకు పదవి ఖాయమని ప్రచారం సాగింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఆయనకు అవకాశం ఇస్తారని ప్రచారం నడిచింది. కానీ ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. రాజ్యసభ పదవి పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఏపీ నుంచి ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేసేందుకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఎనిమిది జరగాల్సి ఉంది. అయితే ఆది నుంచి జనసేన తరఫున నాగబాబు తప్పకుండా పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. అయితే వివిధ సమీకరణల్లో భాగంగా బిజెపికి ఒక పదవి ఇవ్వాల్సి వచ్చింది. తెలంగాణ అవసరాల దృష్ట్యా ఆర్ కృష్ణయ్యకు బిజెపి మరోసారి ఛాన్స్ ఇచ్చింది. అటు టిడిపిలో సైతం సర్దుబాటు చేయాల్సి వచ్చింది. బీదా మస్తాన్ రావు తో పాటు సానా సతీష్ పేరు ఖరారు అయ్యింది. ఈ తరుణంలో నాగబాబుకు చాన్స్ లేకుండా పోయింది. అందుకే అప్పటికప్పుడు మంత్రి పదవిని సర్దుబాటు చేస్తూ చంద్రబాబు ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ముందస్తు వ్యూహం అని.. చంద్రబాబు, పవన్ గతంలోనే నిర్ణయించుకున్నారని.. అందులో భాగంగానే ఇప్పుడు నాగబాబు పేరును మంత్రిగా ప్రకటించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.