CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎన్డీఏ నేతల సమావేశంలో సైతం పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. దీంతో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మంగళవారం రాత్రి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. అక్కడే బస చేశారు.ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్ లో నివాళులు అర్పించారు. ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ దగ్గర నివాళులు అర్పించారు. ప్రార్థన కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు.
* ప్రధానితో భేటీ
ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు ప్రధాని మోదీని కలవనున్నారు. అనంతరం హోం మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు. 2025 ఫిబ్రవరి 1 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో ఏపీకి సంబంధించిన డిమాండ్లను ప్రధాని ముందు ఉంచనున్నట్లు సమాచారం. గత బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను సైతం పూర్తి చేయడంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై కేంద్ర మంత్రులకు విన్నవించే అవకాశం ఉంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించేందుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని సైతం చంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చలు జరుపుతారని.. ఏపీకి సంబంధించి రావాల్సిన ఆర్థిక అంశాలపై వినతి పత్రం ఇస్తారని తెలుస్తోంది.
* ఎన్డీఏ పక్ష సమావేశం
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతల సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. ఎన్డీఏ తదుపరి కార్యాచరణ పై సైతం చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకొచ్చిన కొత్త సంస్కరణలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.