CM Chandrababu (3)
CM Chandrababu: ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతోంది. ఎనిమిదో నెలలో అడుగుపెట్టింది. దీంతో దాదాపు హనీమూన్ పీరియడ్ పూర్తయింది. ఇప్పుడు పాలనతో పాటు సంక్షేమంలో తమ ముద్రను చూపించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు కీలక విషయాన్ని బయటపెట్టారు. సంక్షేమం అంత ఈజీ కాదని సంకేతాలు పంపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేయలేమని సుతిమెత్తగా చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా సంక్షేమ పథకాల అమలు కొద్ది రోజులపాటు జాప్యం జరగక తప్పదని తేల్చి చెప్పారు.
* తక్షణం అమలు చేస్తామన్న హామీ బుట్ట దాఖలు
అయితే అధికారంలోకి వచ్చిన మరుక్షణం సంక్షేమ పథకాలు( welfare schemes) అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఒక్క పింఛన్ పథకాన్ని అమలు చేయగలిగారు. మూడు వేల రూపాయల నుంచి 4 వేల రూపాయలకు పింఛన్ మొత్తాన్ని పెంచారు. ఇలా పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి వర్తింపజేశారు. దీంతో సంక్షేమ పథకాలు ప్రారంభమవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చారు. అందుకు ప్రత్యేక పోర్టల్ ను కూడా తయారు చేశారు. కానీ ఇది జరిగి ఏడు నెలలు అవుతున్నా అన్నదాత సుఖీభవ పథకానికి అతీ గతీ లేకుండా పోతోంది.
* జగన్ హయాంలో సంక్షేమానికి పెద్ద పేట
వాస్తవానికి జగన్( Jagan Mohan Reddy) తన హయాంలో సంక్షేమ పథకాలను అమలు చేయగలిగారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారు. కానీ అభివృద్ధిని మర్చిపోవడంతో ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో తాను అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతోపాటు అభివృద్ధిని చేసి సైతం చూపిస్తానని హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు సంక్షేమానికి దూరం అన్న విషయం ప్రజలకు తెలుసు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు దానిని చూశారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో ప్రజలు చంద్రబాబు వైపు చూశారు. అభివృద్ధి చేయలేదన్న విమర్శను జగన్ మూటగట్టుకోవడం, ఆపై 3 పార్టీలు కూటమి కట్టడం వంటి కారణాలతో చంద్రబాబుకు కలిసి వచ్చింది. సంక్షేమానికి చంద్రబాబు దూరమని తెలిసినా ప్రజలు పట్టం కట్టాల్సి వచ్చింది.
*అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన మాట
అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు( Chandrababu) మాట మార్చారు. సంక్షేమం అమలు చేయాలంటే రాష్ట్రం దివాలా అంచున ఉందని చెప్పుకొచ్చారు. గల్లా పెట్టేలో ఏమీ లేదని తేల్చేశారు. పదేపదే అదే విషయాన్ని చెప్పుకుంటూ.. ఇప్పుడు ఒక్కసారిగా బాంబు పేల్చారు. అయితే చంద్రబాబు సంక్షేమ పథకాల జాప్యం, తాజా ప్రకటనపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే వారు జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చినా పెద్దగా వైసీపీని ఆదరించలేదు. అప్పట్లో ఈ సంక్షేమ పథకాలు ఎవరు ఇమ్మన్నారు? అంటూ ఎగువ మధ్య తరగతి వారు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో సంక్షేమ పథకాలు గతంలో తీసుకున్న సామాన్యులు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. అదే సమయంలో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్లో మాత్రం ఇంకా అసంతృప్తి కనిపించడం లేదు. మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలయింది అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు.