CM Chandrababu: ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 10 బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు సైతం ఆమోదముద్ర వేశారు. 2026- 27 లో వీటిని అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పాఠశాలలు అందుబాటులోకి వస్తే ఏకంగా మూడు వేల మంది విద్యార్థులకు వసతితో కూడిన విద్యా బోధన అందుతుంది. అయితే వచ్చే ఏడాది సైతం మరో 10 బీసీ గురుకులాలు ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల 10 గురుకులాలకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు.
* ఆ 89 చోట్ల
కూటమి ప్రభుత్వం( allians government) విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని భావిస్తోంది. నియోజకవర్గానికి ఒక గురుకులం ఉండేలా ప్లాన్ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే 86 నియోజకవర్గాల్లో మాత్రమే గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 89 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకే ఇప్పుడు విడతల వారీగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. గురుకుల ప్రవేశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు.. డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలను పరిగణలోకి తీసుకొని కొత్త వాటిని మంజూరు చేయనున్నారు. మొత్తం 20 నియోజకవర్గాల్లో ఇప్పుడు గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 10, వచ్చే ఏడాది మరో 10 పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* సొంత భవనాల ఏర్పాటు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 86 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఒక్కో పాఠశాలను పరిశీలిస్తే.. 480 మంది విద్యార్థులు చొప్పున ఉన్నారు. అయితే ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న పాఠశాలల్లో మాత్రం తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండడం విశేషం. వసతి సమస్య ఉండడంతో 240 మంది వరకు మాత్రమే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ బీసీ గురుకులాలకు సొంత భవనాలను వీలైనంత త్వరగా సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ గురుకులాలకు సంబంధించి అడ్మిషన్లకు రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో విపరీతమైన డిమాండ్ ఉంది. రాయలసీమలో ఒక్కో సీటు కోసం 15 మంది పోటీపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఒక్కో సీటుకి ఐదు నుంచి పదిమంది పోటీ పడుతున్నారు. దీనిని పరిగణలోకి తీసుకుని రాయలసీమలో 12, ఉత్తరాంధ్రలో 4, కోస్తా ఆంధ్రాలో నాలుగు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. ఎక్కువగా డిమాండ్ ఉన్న నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒక్కో గురుకులం నిర్మాణం కోసం దాదాపు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే నిధులు కేటాయించి భవనాల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.