CM Chandrababu: బిజెపితో టిడిపి పొత్తు కుదిర్చిన వారు ఎవరు? అలా బిజెపి పెద్దలను ఒప్పించిన వారు ఎవరు? చంద్రబాబుతో కలవడానికి ఇష్టపడని బిజెపిని దారికి తెచ్చింది ఎవరు? అంటే ముమ్మాటికి పురందేశ్వరి అని సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు నుంచి ఇదే మాట బయటకు వచ్చింది. ఆమె అధ్యక్షురాలిగా ఉండడం వల్లే బిజెపి టిడిపి కూటమిలోకి వచ్చిందని అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పురందేశ్వరిని ఆకాశానికి ఎత్తేశారు. చాలా గౌరవంతో మాట్లాడారు. తమది హిట్ కాంబినేషన్ అని.. పవన్, పురందేశ్వరి సహకారంతోనే ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇదే చంద్రబాబును వ్యతిరేకించి పురందేశ్వరి కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీలో కేంద్రమంత్రి పదవి పొందారు. అటు తరువాత బిజెపిలో చేరారు.ఇప్పుడు అదే చంద్రబాబు సీఎం కావడానికి దోహదపడ్డారు.
* నాడు కలిసికట్టుగానే
1995 టిడిపి సంక్షోభ సమయంలో చంద్రబాబు వెంట దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఉండేవారు. మొత్తం నందమూరి కుటుంబం సైతం చంద్రబాబుకు అనుకూలంగా ఉండేది. కానీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తోడల్లుడు వెంకటేశ్వరరావు తో చంద్రబాబుకు విభేదాలు వచ్చాయి. టిడిపిలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు పార్టీకి దూరమయ్యారు. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. దీంతో వెంకటేశ్వరరావు దంపతులు వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
* 2004లో తొలిసారిగా ఎంపీ
2004లో బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు పురందేశ్వరి. ఘన విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో బాపట్ల ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఆ సమయంలో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు పురందేశ్వరి. ఎంపీగా గెలవడమే కాదు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ డీలా పడింది. ఆ సమయంలో ఆమె బిజెపిలో చేరారు. పొత్తులో భాగంగా రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు.
* కుటుంబాల మధ్య సయోధ్య
అయితే చంద్రబాబుతో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉన్న దశాబ్దాల వైరం దృష్ట్యా.. ఆ రెండు కుటుంబాలు కలవవని భావించారు.కానీ రెండు కుటుంబాల మధ్య సయోధ్య నెలకొంది. రాకపోకలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో పురందేశ్వరి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని పురందేశ్వరిని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారని ప్రచారం జరిగింది. కానీ ఆమె ఎప్పుడూ చంద్రబాబును టార్గెట్ చేయలేదు. టిడిపి పై విమర్శలు చేయలేదు. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసుకునేవారు. జగన్ పై వ్యక్తిగత కామెంట్లు కూడా చేసేవారు.
* బిజెపి పెద్దలపై ఒత్తిడి
టిడిపి విషయంలో బిజెపి అభిప్రాయాన్ని మార్చింది కూడా పురందేశ్వరి అని తేలిపోయింది. ఆమె కంటే ముందుగా అధ్యక్ష పదవిలో ఉన్న సోము వీర్రాజు టిడిపిని టార్గెట్ చేసుకునేవారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉండేవి. ఒకవేళ సోము వీర్రాజు ఎన్నికల వరకు కొనసాగి ఉంటే టిడిపితో బీజేపీ పొత్తు ఉండేది కాదన్న అభిప్రాయం కూడా ఉంది. కేవలం పురందేశ్వరి చొరవతోనే పొత్తు కుదిరిందని తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలతో తెలుస్తోంది. మొత్తానికైతే మరిది కోసం పెద్ద సాహసమే చేశారు పురందేశ్వరి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Cm chandrababu compliments on daggubati purandeswari
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com