Mega Family: మెగా కుటుంబంలో( mega family) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో మెగా ఫ్యామిలీ సానుకూలంగా ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. టిడిపి కూటమిలో జనసేన కీలక భాగస్వామిగా ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నేతల మధ్య విభేదాలు రావడం సర్వసాధారణం. ముఖ్యంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న మెగా కుటుంబం చంద్రబాబుతో సమానంగా ప్రదర్శన చేయాలి. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం మెగా కుటుంబం తన సానుకూలతను వ్యక్తం చేస్తూనే ఉంది. చంద్రబాబు సీనియారిటీని గౌరవిస్తూ ముందుకు సాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నడు చంద్రబాబు విషయంలో తక్కువ చేసి మాట్లాడలేదు. చంద్రబాబు పాలనా దక్షుడు అని.. ఆయన మార్గదర్శకంలోనే ముందుకు సాగుతామని తరచూ చెబుతుంటారు. ఇప్పుడు అదే బాటలో ఉన్నారు మెగా బ్రదర్స్ నాగబాబు, చిరంజీవి. చంద్రబాబు విషయంలో మునుపటిలా వ్యవహరించకుండా.. వేదికలు ఏదైనా చంద్రబాబు నాయకత్వం, సమర్థత గురించి మాట్లాడుతుండడం విశేషం.
Also Read: మాజీ మంత్రి విడదల రజిని చుట్టు ఉచ్చు.. బెదిరింపు కేసులో కీలక అరెస్ట్!
* నాగబాబు దూకుడు.. రాజకీయాల్లోకి( politics) రాకమునుపు మెగా బ్రదర్ నాగబాబు( Naga babu ) చంద్రబాబుతో పాటు బాలకృష్ణ లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్స్ చేసేవారు. అటువంటి నాగబాబు ఇప్పుడు పూర్తిగా రూటు మార్చారు. మొన్న చంద్రబాబు జన్మదినం నాడు ఒక వీడియో విడుదల చేశారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ ఆయన గురించి అనేక రకాల ప్రస్తావన తీసుకొచ్చారు. సహనం, సంయమనం ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. అందుకే ఆయన ఈ స్థాయికి వచ్చారని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర కీలకమన్నారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందన్నారు. అయితే నాగబాబు కామెంట్స్ ను చూసినవారు ముక్కున వేలేసుకున్నారు. గతంలో ఇదే నాగబాబు చంద్రబాబుపై విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
* చిరంజీవి ప్రశంసలు..
తాజాగా మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) సైతం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. విజయవాడలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు చిరంజీవి హాజరయ్యారు. ఈ క్రమంలో చిరంజీవి చంద్రబాబు గురించి మాట్లాడారు. కళాశాల స్థాయి నుంచి చంద్రబాబు నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారని చెప్పుకున్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు చాలా కష్టపడ్డారని కొనియాడారు. తనకు సినిమాలంటే ఎంత మక్కువో.. చంద్రబాబుకు రాజకీయాలంటేనే అంత మక్కువ అని చెప్పారు చిరంజీవి. అంది వచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకుని ఈ స్థాయికి చేరుకున్నారని చిరంజీవి చెప్పారు. దూర దృష్టితో ఆలోచించి హైదరాబాదును ఐటి నగరంగా మార్చారని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో మార్గదర్శకుడు చంద్రబాబు అని చెప్పారు చిరంజీవి.
* ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీతో..
వాస్తవానికి 2009లో ప్రజారాజ్యం పార్టీ( Praja Rajyam party) మూలంగానే తెలుగుదేశం అధికారంలోకి రాలేకపోయింది అన్న కామెంట్స్ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు టిడిపి వామపక్షాలు, కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. మహా కూటమిగా బరిలో దిగింది. నాడు ప్రజారాజ్యం బరిలో దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఓట్లు సొంతం చేసుకుంది. ఓట్లు చీలిపోయి అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూరిందని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. అప్పటినుంచి మెగా కుటుంబం పై టిడిపిలో ఒక రకమైన భిన్నభిప్రాయం ఉండేది. కానీ పవన్ స్నేహం చేశాక ఆ పరిస్థితిలో మార్పు కనిపించింది. ఇప్పుడు ఏకంగా మెగా బ్రదర్స్ సైతం చంద్రబాబుకు అనుకూలంగా మారడం నిజంగా విశేషమే.
Also Read: మాధురి పోస్టింగ్.. దువ్వాడ ఊస్టింగ్!