CM Chandrababu: అమరావతి రాజధాని( Amaravathi capital ) నిర్మాణం పై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ నెల చివర్లో పునర్నిర్మాణ పనులు ప్రారంభించనుంది. అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లో నిధుల సమీకరణ భారీగా జరిగింది. ఇకనుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని చంద్రబాబు సర్కార్ చూస్తోంది. 2028 నాటికి అమరావతి నిర్మాణాన్ని ఒక కొలిక్కి తేవాలన్నది చంద్రబాబు వ్యూహం. తద్వారా కూటమి ప్రభుత్వం పట్ల ఒక సానుకూల ఏర్పరచాలన్నది ఒక ప్లాన్. అందుకు తగ్గట్టుగానే నిధుల సమీకరణలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు. దాదాపు 45 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ నెల చివర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది చంద్రబాబు ప్లాన్.
Also Read: మంత్రితో ఆ వైసీపీ మాజీ మంత్రి రహస్య భేటీ.. నిజం ఎంత?
* అందరి ఆమోదయోగ్యంతో..
2014లో అందరి ఆమోదయోగ్యంతో అమరావతి రాజధానిని ఎంపిక చేశారు చంద్రబాబు( Chandrababu). దాదాపు 32 వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించగలిగారు. అటు రైతుల సైతం స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చారు. అయితే అప్పట్లో ఈ పరిణామాలను ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి. రాజధానికి ఆ భూమి సరిపోదని.. మరింత భూమిని సమీకరించాలని సూచించారు కూడా. అయితే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తగినంతగా సహకారం అందించలేదు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ ఎటువంటి వరం ప్రకటించలేదు. ఈ తరుణంలో రాజకీయంగా బిజెపితో విభేదించింది తెలుగుదేశం పార్టీ. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది. దాని ప్రభావం అమరావతి రాజధానిపై పడింది. ఆశించిన స్థాయిలో పనులు ముందుకెళ్లలేదు. ఇంతలోనే ఏపీలో అధికార మార్పిడి జరిగిపోయింది.
* వైసిపి పై వ్యతిరేకతకు అదే కారణం..
2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం చేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేసి.. పాలనా రాజధానిగా విశాఖను చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. మరోవైపు కర్నూలు న్యాయ రాజధానిగా చేసి రాయలసీమ ప్రజలకు సంతృప్తి పరచాలన్నది ఒక వ్యూహం. అయితే మూడు రాజధానుల విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేయలేకపోయారు. అలాగని అమరావతి రాజధానిని కొనసాగించలేకపోయారు. మొత్తానికి గత ఐదేళ్లలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్న విమర్శలను ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. దాని ప్రభావం మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అమరావతిని నిర్వీర్యం చేశారన్న కోపం, కసి కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో స్పష్టమైంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
* బలమైన సంకల్పంతో..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాభవం ముమ్మాటికి అమరావతి రాజధాని ఎఫెక్ట్ అని తేలిపోయింది. అందుకే చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది ఎన్డిఏ ప్రభుత్వం. అందులో అమరావతి కి కూడా ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. ఇదే దూకుడుతో అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఒక కొలిక్కితేస్తే ప్రజల్లో కూడా ఒక రకమైన సానుకూలత వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి తమను గెలిపిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. చూడాలి మరి ఏం జరగనుందో?